TDP: పోలింగ్ కు గంట ముందు రాజీనామా ఆమోదిస్తారా?: గంటా

  • రెండేళ్లుగా తన రాజీనామా లెటర్ పెండింగ్ లో ఉందన్న టీడీపీ ఎమ్మెల్యే
  • అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శ
  • వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను కట్టడి చేసే ప్రయత్నమని వివరణ
TDP Mla ganta srinivasarao clarifies about his resignation

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న రాజీనామా లెటర్ ను పోలింగ్ కు గంట ముందు ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ విషయంలో తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని గంటా తేల్చిచెప్పారు. తన రాజీనామాను ఆమోదించారంటూ జరుగుతున్న ప్రచారం ఓ మైండ్ గేమ్ అని అన్నారు. తమ అసంతృప్త ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వైసీపీ ఆడుతున్న కొత్త నాటకమని గంటా వివరించారు.

టీడీపీలో ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నాడని ప్రచారం చేయడం వల్ల తమ అసంతృప్త ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతారని వైసీపీ ఆలోచన.. అందుకే ఈ దుష్ప్రచారానికి తెరలేపిందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం స్పీకర్ ను కలిసి రాజీనామా లెటర్ ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత కూడా రెండుసార్లు వ్యక్తిగతంగా కలిసి, తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశానని ఎమ్మెల్యే తెలిపారు. అయినా ఆమోదించలేదని, ఇప్పుడు పోలింగ్ కు ముందు ఆమోదించడం కుదరదని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ వచ్చాక ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించడమనేది సాంకేతికంగా కుదరదని అన్నారు. ఒకవేళ చేస్తే మాత్రం వైసీపీ పెద్ద తప్పుచేసినట్లే అవుతుందని చెప్పారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ నామినేషన్ పత్రాలపై తాను ప్రపోజల్ సంతకం చేశానని గంటా తెలిపారు. తమ అభ్యర్థి గెలవబోతున్నారని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News