ఏపీ ఎమ్మెల్సీ పోలింగ్ లో ఉత్కంఠ

  • వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న టీడీపీ
  • తమ ఎమ్మెల్యేలు ఎవరూ గీత దాటరంటున్న వైసీపీ
  • రెబల్స్ మినహా వైసీపీతో 154 ఎమ్మెల్యేలు
  • టీడీపీలో నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు
  • కొనసాగుతున్న పోలింగ్.. సాయంత్రం కౌంటింగ్
AP MLC Election Polling started

ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం ఏడు సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా పోలింగ్ బూత్ కు చేరుకోలేదు. ఈ ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మైండ్ గేమ్ కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

వారితో మాట్లాడుతున్నామని, టీడీపీ అభ్యర్థికి ఓటేయాలని కోరుతున్నామని అంటున్నారు. అయితే, తమ అసంతృప్త నేతలతో ఇప్పటికే మాట్లాడామని వైసీపీ నేతలు పేర్కొన్నారు. వారికి భరోసా కల్పించామని, తమ ఎమ్మెల్యేలు ఎవరూ గీత దాటే ప్రశ్నేలేదని తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో ఉత్కంఠను రేపుతున్నాయి.

సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అనంతరం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. ఏడు సీట్లకు జరుగుతున్న ఎన్నికలలో ఒక్క స్థానానికి టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈ ఓటింగ్ కోసం తమ ఎమ్మెల్యేలు అందరినీ ఏకకాలంలో తరలించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి 19 మంది ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రానికి చేరుకోనున్నారు.

కీలకంగా రెబల్స్ ఓటు..
ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలలోని రెబల్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఏడు సీట్లను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న వైసీపీకి ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల రూపంలో రెబల్ ముప్పు పొంచి ఉంది. వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ ల రూపంలో టీడీపీకి టెన్షన్ తప్పడంలేదు. ఇక జనసేన పార్టీ నుంచి గెలిచిన రాపాక మొదటి నుంచీ వైసీపీ వైపే మొగ్గుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి 154 ఎమ్మెల్యేల బలం ఉండగా.. టీడీపీ బలం 19 (నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు మినహా).

టీడీపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డా కూడా పంచుమర్తి అనురాధను గెలిపించుకోవాలంటే మరో ఓటు కావాలి. అయితే, తమ అభ్యర్థి గెలుపు ఖరారైనట్లేనని టీడీపీ బలంగా నమ్ముతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు 16 మంది తమతో టచ్ లో ఉన్నారని చెబుతోంది.

More Telugu News