Lond: ఖలిస్థానీవాదులకు భారత్ దీటైన జవాబు.. లండన్ రాయబార కార్యాలయం వద్ద భారీ త్రివర్ణ పతాకావిష్కరణ

  • బుధవారం భారత రాయబార కార్యాలయం ఎదుట ఖలిస్థానీవాదుల నిరసనలు
  • వారి ముందే భారీ పతాకాన్ని ఆవిష్కరించిన భారత అధికారులు
  • హైకమిషన్ భవనం వద్ద లండన్ పోలీసుల కట్టుదిట్టమైన భద్రత
Indian embassy officials large tricolor flag in high commission amid khalistani protests

భారత జాతీయ పతాకాన్ని తొలగించి, అగౌరవ పరిచిన ఖలిస్తానీ మద్దతుదారులకు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం దీటుగా జవాబిచ్చింది. బుధవారం హైకమిషన్ భవనంపై భారత అధికారులు భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భవనంపై డజనుకు పైగా ఎంబసీ అధికారులు జాతీయ జెండాను సగర్వంగా ఆవిష్కరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖలిస్థానీ మద్దతుదారుల నిరసనలు కొనసాగుతున్న తరుణంలో అధికారులు జాతీయ ఐక్యతను సగర్వంగా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇదిలా ఉంటే.. బుధవారం కూడా ఖలిస్థానీ మద్దతుదారులు లండన్‌‌లోని ఇండియన్ మిషన్ వద్ద నిరసనలు కొనసాగించారు. దాదాపు 2 వేల మంది అక్కడకు చేరుకుని ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. కొందరు భద్రతా సిబ్బందిపై ఇంక్ చల్లారు. ఈ సమయంలోనే భారత అధికారులు భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. నిరసనలు కట్టుదాటకుండా ఉండేందుకు బుధవారం స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాయబార కార్యాలయానికి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఖలిస్థానీ నిరసనలను ఆమడ దూరంలోనే ఉంచారు. అంతేకాకుండా.. భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. సుమారు 20 బస్సుల్లో పోలీసులను రప్పించారు. ఇదిలా ఉంటే..భారత్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయం వద్ద ఢిల్లీ పోలీసులు బ్యారికేడ్లు తొలగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి రక్షణ కల్పించడంలో బ్రిటన్ పోలీసులు విఫలమైనందుకు నిరసనగా ఢిల్లీ పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లండన్‌లోని భారత కార్యాలయం వద్ద స్థానిక పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News