Visakhapatnam: విశాఖలో కూలిన మూడంతస్తుల భవనం.. అన్నాచెల్లెళ్లు సహా ముగ్గురి మృతి

Death Toll Raised to 3 in Visakhapatnam Building Collapse
  • నగరంలోని రామజోగిపేటలో గత రాత్రి కుప్పకూలిన భవనం
  • పుట్టిన రోజు జరుపుకున్న గంటల్లోనే బాలిక మృతి
  • ఈ ఉదయం బీహార్‌కు చెందిన యువకుడి మృతదేహం గుర్తింపు
విశాఖపట్టణంలో మూడంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. భవనం కూలిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది తాజాగా ఈ ఉదయం మరో మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. మృతుడిని బీహార్‌కు చెందిన 27 ఏళ్ల చోటూగా గుర్తించారు. నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో గత అర్ధరాత్రి దాటిన తర్వాత మూడంతస్తుల భవనం ఉన్నపళాన కుప్పకూలింది. ఈ ఘటనలో సాకేటి అంజలి (14), ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ (17) మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద సమయంలో భవనంలో 8 మంది ఉన్నారు. గాయపడిన ఐదుగురిని కేజీహెచ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాలిక అంజలి నిన్ననే తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన కొన్ని గంటల్లోనే ప్రమాదంలో అంజలి, ఆమె సోదరుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భవనం కూలిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Visakhapatnam
Building Collapse
Bihar

More Telugu News