బీజేపీ నోరు మెదపకున్నా.. వచ్చేసారీ తానే సీఎంనంటున్న బసవరాజ్ బొమ్మై

  • తల్లి కర్ణాటకకు సేవ చేసే అదృష్టాన్ని భగవంతుడు తనకు ఇచ్చాడన్న బొమ్మై
  • బొమ్మై పనితీరు చూసి సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు బీజేపీ సిగ్గుపడుతోందన్న కాంగ్రెస్
  • సీఎంతో మోదీ, షా మాట్లాడడమే లేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్
 Will return as chief minister says Bommai But BJP keeps mum

కర్ణాటకలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలన్నీ అప్పుడే ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని, మళ్లీ తాను ముఖ్యమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. 

ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా హుంగుండ్‌లో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రినని, తల్లి కర్ణాటకకు సేవ చేసే అవకాశాన్ని ఆ భగవంతుడు తనకు కల్పించాడని అన్నారు. తాను చాలా నిజాయతీతో పనిచేస్తున్నట్టు చెప్పారు.  12వ శతాబ్దం నాటి సంఘ సంస్కర్త, లింగాయత్ శాఖ స్థాపకుడు బసవేశ్వరుడు చెప్పిన ‘పనియే దైవం’, ‘సామాజిక సమానత్వం’ దారిలో నడుస్తున్నట్టు చెప్పారు. 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల పెట్టుబడుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గతేడాది నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో రాష్ట్రానికి రూ. 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథాన సాగాలంటే మరోమారు బీజేపీని ఎన్నుకోవాలని కోరారు.  

బీజేపీ గప్‌చుప్
వచ్చే సారీ సీఎం పగ్గాలు చేపట్టేది తానేనని బొమ్మై చెబుతున్నప్పటికీ బీజేపీ పెద్దలు మాత్రం ఈ విషయంలో మౌనం దాల్చడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో బీజేపీ ఇంకా ఓ నిశ్చితాభిప్రాయానికి రానప్పటికీ బొమ్మై మాత్రం తానే సీఎంనని చెప్పుకుంటుండడం బీజేపీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ విమర్శలు
మరోవైపు, కాంగ్రెస్ కూడా ఈ విషయంలో బొమ్మైపై విమర్శలు సంధించింది. బొమ్మైతో కనీసం మాట్లాడేందుకు కూడా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఇష్టపడడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ విమర్శించారు. మంత్రి మురుగేశ్ రుద్రప్ప కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని అన్నారు. బొమ్మై పనితీరు చూసి సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు బీజేపీ సిగ్గుపడుతోందని రిజ్వాన్ అన్నారు.

More Telugu News