పాపం సూర్య... వరుసగా మూడో మ్యాచ్ లోనూ తొలి బంతికే అవుట్

  • సూర్యకుమార్ యాదవ్ కు కలిసిరాని అదృష్టం
  • చెన్నై మ్యాచ్ లో తొలి బంతికే బౌల్డ్
  • గత రెండు మ్యాచ్ ల్లోనూ తొలి బంతికే వెనుదిరిగిన సూర్య
Surya Kumar Yadav third duck in a row

టీ20ల్లో బౌలర్ ఎంతటివాడైనా గానీ చుక్కలు చూపించే డాషింగ్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ వన్డేల్లో దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ కు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్... ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ ల్లోనూ డకౌట్ అయ్యాడు. ఇవాళ చెన్నై వన్డేలోనూ అతడి తలరాత మారలేదు. తాను ఆడిన మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు. తన బ్యాటింగ్ పట్ల తానే దిగ్భ్రాంతికి లోనయ్యాడు. 

మొదటి వన్డేలో స్టార్క్ బౌలింగ్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రెండో వన్డేలోనూ అచ్చం అదే రీతిలో స్టార్క్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇది కూడా తొలి బంతికే. వరుసగా రెండుసార్లు సున్నాలు చుట్టి గోల్డెన్ డక్ సాధించాడు. 

ఇవాళ మూడో మ్యాచ్ లోనూ అందరినీ నివ్వెరపరుస్తూ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే అవుట్ కాగా, ప్రేక్షకులు ఒక్కసారిగా మూగబోయారు. ఆస్టన్ అగర్ బౌలింగ్ లో అవుటైన సూర్య తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. టీ20 క్రికెట్లో బౌలర్లను ఊచకోత కోస్తూ మిస్టర్ 360గా పేరుగాంచిన సూర్య ఇంత దారుణంగా ఆడుతుండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

More Telugu News