ఆరేళ్ల తర్వాత స్మిత్ డకౌట్.. ఆ ఘనత పాండ్యాదే!

  • 2017లో బ్రిస్బేన్‌లో పాకిస్థాన్‌పై స్మిత్ డకౌట్
  • ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు హర్దిక్ పాండ్యా చేతిలో
  • వన్డే కెరియర్‌లో స్మిత్ డకౌట్ అయింది ఆరుసార్లే
Steve Smith Got Duck Out After 6 Years In Chennai One Day

ఆస్ట్రేలియాతో చెన్నైలోని ఎంఏ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (33) అవుటైన తర్వాత వచ్చిన ఆసీస్ స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను పాండ్యా డకౌట్ చేశాడు. పాండ్యా వేసిన బంతిని ఆడడంలో తడబడిన స్మిత్ వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడు బంతులు ఆడిన స్మిత్ ఖాతా తెరవకుండానే డ్రెస్సింగ్ రూమ్ బాట పట్టాడు.  

స్మిత్ డకౌట్ కావడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. జనవరి 2017లో బ్రిస్బేన్‌లో జరిగిన వన్డేలో స్మిత్ డకౌట్ అయ్యాడు. మొహమ్మద్ ఆమిర్ అతడిని అవుట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు స్మిత్‌ను పాండ్యా డకౌట్ చేశాడు. స్మిత్ తన వన్డే కెరియర్‌లో అంటే.. 126 ఇన్నింగ్స్‌లలో ఆరుసార్లు మాత్రమే డకౌట్ అయ్యాడు. కాగా, ఈ వన్డే సిరీస్‌లో స్మిత్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిసి చేసింది 22 పరుగులే.

స్మిత్ ఖాతా తెరవని మ్యాచ్‌లు ఇవే..
* హోబర్ట్‌లో 2011లో ఇంగ్లండ్‌‌పై
* 2011లో సిడ్నీలో ఇంగ్లండ్‌పై
* కేప్‌టౌన్‌లో 2016లో దక్షిణాఫ్రికాపై
* 2016లో మెల్‌బోర్న్‌లో న్యూజిలాండ్‌పై
* 2017లో బ్రిస్బేన్‌లో పాకిస్థాన్‌పై 
* 2023లో చెన్నైలో భారత్‌పై

More Telugu News