Bengaluru: నెలకు రూ.లక్ష శాలరీ.. మీమ్స్ చేయడం తెలిస్తే చాలు!

  • మీమ్స్ చేసే వారికి నెల రూ. లక్ష ఇస్తామంటూ యాడ్
  • లింక్డ్‌ఇన్‌‌లో స్టార్టప్ సంస్థ స్టాక్ బ్రో ఇచ్చిన ప్రకటన వైరల్
  • నేటి తరాన్ని ఆకట్టుకునేందుకు మీమ్స్ నిపుణుల కోసం గాలం
Bengaluru startup looking for a chief meme expert offering 1 lakh per month salary

సామాజికాంశాలపై సెటైరికల్‌ వ్యాఖ్యలకు ఒకప్పుడు వార్తాపత్రికల్లోని కార్టూన్లకు మించినది మరొకటి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియా వచ్చాక ప్రజల సృజనాత్మకత మరింత పదును తేలింది. ఈ క్రమంలోనే మీమ్స్ పాప్యులర్ అయ్యాయి. సినీ,రాజకీయ రంగాల్లోని ప్రముఖుల ఫొటోలు, డైలాగుల సాయంతో నెటిజన్లు సంధించే సెటైర్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయా సందర్భాల్లో సెలబ్రిటీల డైలాగులను సందర్భానికి తగ్గట్టు పంచ్‌లైన్లు‌గా వాడుకుంటూ చేసే మీమ్స్‌కు యువతలో యామా క్రేజ్ ఉంది. అసలు ఇప్పుడు యువతకు చేరువకావాలంటే.. వారి మనసు చూరగొనాలంటే మీమ్స్‌కు మించిన మార్గం మరొకటి లేదు. ఇప్పటికే రాజకీయ ప్రచారాల్లో, వ్యాపార ప్రకటనల్లో ఈ ట్రెండ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.   

అందుకే.. యువత నాడిని పట్టేసిన ఓ బెంగళూరు కంపెనీ మీమ్స్ చేసేవారికి ఉద్యోగం ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తమ సంస్థలో చీఫ్ మీమ్స్ ఆఫీసర్‌‌గా చేరితే నెలకు రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. లింక్డ్‌ఇన్‌లో స్టాక్ బ్రో అనే స్టార్టప్ చేసిన ఈ ప్రకటన నెట్టింట వైరల్‌గా మారింది. జెన్‌జెడ్ యువత ప్రస్తుతం కొత్త విషయాలను మీమ్స్ ద్వారా తెలుసుకుంటున్నారని సంస్థ పేర్కొంది. కాబట్టి..మీమ్స్ నిపుణుడిని చీఫ్ మీమ్స్ ఆఫీసర్‌గా నియమించుకునేందుకు సిద్ధమయ్యామని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. మీమ్స్ ఎక్స్‌పర్ట్‌లను వెతికిపట్టుకునేందుకు సంస్థకు సహకరించిన వారికి కూడా ఓ ఐప్యాడ్ ఇస్తామంటోంది స్టాక్ బ్రో!

More Telugu News