KTR: మీరేమో 14 రోజులు జైలుకు పంపిస్తారు.. మేం మాత్రం మౌనంగా ఉండాలా?: కేటీఆర్

  • ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై ట్విట్టర్ లో మంత్రి ప్రశ్న
  • సీఎంను అవమానించినా సైలెంట్ గానే ఉండాలా?
  • కన్నడ నటుడు చేతన్ అరెస్టు వీడియోను షేర్ చేసిన కేటీఆర్
  • మన రాష్ట్రంలో కూడా ఇలాగే చేయాలా.. మీరేమంటారని ప్రజలకు ప్రశ్న
Telangana minister ktr questions bjp about kannada actor chetan

సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులకు సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులను అవమానించేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని మరోమారు మంత్రి హెచ్చరించారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే కించపరిచేలా మాట్లాడడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదన్నారు. ముఖ్యమంత్రిని అవమానించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే 14 రోజుల జైలు శిక్ష తప్పదని మంత్రి కేటీఆర్ చెప్పారు. అక్కడి తరహాలోనే మన తెలంగాణలో కూడా అమలుచేస్తేనే వారికి తెలిసొస్తుందని అన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ మీ అభిప్రాయం చెప్పాలని ప్రజలను కోరారు. కన్నడ యాక్టర్ చేతన్ అరెస్టు వీడియోను ట్వీట్ కు మంత్రి కేటీఆర్ జతచేశారు. హిందుత్వంపై అభ్యంతరకర ట్వీట్ చేశాడంటూ కన్నడ యాక్టర్ చేతన్ ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. చేతన్ ను కోర్టు 14 రోజుల కస్టడీకి ఆదేశించింది. ఈ వార్తను ఉటంకిస్తూ తెలంగాణలో కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు, ట్వీట్లు చేసిన వారిని జైలుకు పంపించాలేమో అని కేటీఆర్ కామెంట్ చేశారు.

More Telugu News