Thailand: లాటరీలో రూ. 2.9 కోట్ల జాక్‌పాట్.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్న భార్య!

Husband Sues Wife For Marrying Another Man After Winning Nearly 3 Crore Lottery
  • థాయిలాండ్‌లో ఘటన
  • అప్పులు తీర్చేందుకు పని కోసం దక్షిణ కొరియా వెళ్లిన భర్త
  • ప్రతి నెల అక్కడి నుంచి భార్యకు డబ్బుల బదిలీ
  • మోసం చేసిందంటూ కోర్టుకెక్కిన భర్త
లాటరీలో కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ మహిళ భర్తకు తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లాడింది. విషయం తెలిసి నిర్ఘాంతపోయిన అమాయక భర్త తనకు న్యాయం చేయాలంటూ కోర్టుకెక్కాడు. థాయిలాండ్‌లో జరిగిందీ ఘటన. నారిన్ అనే వ్యక్తికి సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం వివాహమైంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలున్నారు. 

47 ఏళ్ల నారిన్‌కు థాయ్ కరెన్సీలో 2 మిలియన్ల బహ్త్‌ల వరకు అప్పులున్నాయి. దీంతో వాటిని తీర్చేందుకు డబ్బు సంపాదన కోసం 2014లో దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ ప్రతి నెల 27-30 వేల బహ్త్‌లను థాయిలాండ్‌లో పిల్లలతో ఉన్న భార్య చవీవన్‌కు పంపేవాడు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత తన భార్యకు రూ. 2.9 కోట్ల లాటరీ గెలుచుకున్న విషయం తెలిసింది. లాటరీ తగిలిన విషయాన్ని భార్య తనకు చెప్పకుండా దాచిపెట్టడంతో అనుమానించాడు. ఫోన్లు చేస్తున్నా లిప్ట్ చేయకపోవడంతో ఈ నెల 3న స్వదేశానికి చేరుకున్నాడు. 

ఇంటికొచ్చాక అతడికి మరో విషయం తెలిసి గుండె ఆగినంత పనైంది. ఫిబ్రవరి 25న ఆమె ఓ పోలీసు అధికారిని వివాహం చేసుకున్న విషయం తెలిసి షాకయ్యాడు. 20 ఏళ్లు తనతో కాపురం చేసిన భార్య ఇలాంటి పనిచేస్తుందని ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెకు ప్రతి నెల డబ్బులు పంపిస్తుండడంతో తన ఖాతాలో ఇప్పుడు 60 వేల బహ్త్‌లు మాత్రమే మిగిలాయని వాపోయాడు. దీంతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. 

అయితే, అతడి భార్య చవీవన్ వాదన మరోలా ఉంది.  తనకు లాటరీ తగలడానికి చాలా ఏళ్ల క్రితమే నరీన్‌తో తెగదెంపులు చేసుకున్నట్టు పేర్కొంది. అయితే, అతడు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Thailand
Lottery
Wife
Husband
Offbeat News

More Telugu News