బాగా లాగిస్తున్నట్టుంది... బొద్దుగా ఉన్న కిమ్ కుమార్తెపై ఉత్తర కొరియన్ల వ్యాఖ్యలు

  • ఇటీవల క్షిపణి పరీక్షలు చేపట్టిన ఉత్తర కొరియా
  • కుమార్తెతో కలిసి వీక్షించిన కిమ్
  • కిమ్ కుమార్తె పుష్టిగా ఉండడంపై కొరియన్ల ఆగ్రహం
North Koreans slams Kim daughter

ఇటీవల ఉత్తర కొరియా అనేక బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టడం తెలిసిందే. ఈ క్షిపణి పరీక్షలకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో పాటు ఆయన కుమార్తె కిమ్ జు యే కూడా హాజరైంది. అయితే, కిమ్ కుమార్తె పుష్టిగా, ఆరోగ్యంగా, ఖరీదైన దుస్తులు ధరించి విలాసవంతంగా కనిపించడంపై ఉత్తర కొరియా ప్రజలు మండిపడుతున్నారు. 

బాగా తింటోందని వ్యాఖ్యానించారు. ఆ అమ్మాయి బాగా తింటుందని తమకందరికీ తెలుసని, ఫ్యాన్సీ డ్రెస్సులు ధరించి టీవీల్లో కనిపిస్తుందని, ఎంతో లగ్జరీగా జీవిస్తుందని ఓ ఉత్తర కొరియా వాసి వెల్లడించాడు. ఇష్టం వచ్చినట్టు తింటుందేమో... ఆమె ముఖం గుండ్రంగా, బొద్దుగా చందమామలా కనిపిస్తుంటుంది అని తమ ప్రజలు అనుకుంటుంటారని ఆ వ్యక్తి వివరించాడు. 

దేశంలో ప్రజలు తినడానికి సరిగా తిండిలేని పరిస్థితుల్లో చాలామంది బుగ్గలు పీల్చుకుని పోయి దవడలకు అంటుకుని ఉంటాయని, కానీ, కిమ్ కుమార్తె అందుకు విరుద్ధంగా ఉందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. 

దేశ రాజధానిలో మిగతా పిల్లలు మూడు పూటలా భోజనం దొరక్క కష్టాలు పడుతుంటే, కిమ్ కుమార్తె చూడండి ఎలా ఉందో అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఇలాంటి పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నాడు. 

కాగా, కిమ్ సంతానం గురించి ఉత్తర కొరియా అధికారిక మీడియా ఎప్పుడూ ప్రస్తావించదు. అయితే, పొరుగునే ఉన్న దక్షిణ కొరియా నిఘా సంస్థ మాత్రం కిమ్ కు ముగ్గురు పిల్లలని... వారు 13, 10, 6 ఏళ్ల వయసు గలవారని చెబుతుంటుంది.

More Telugu News