patient death: డాక్టర్ల తప్పిదం.. రూ.33 లక్షలు చెల్లించాలని ఆదేశం

  • కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చిన మహిళ విషయంలో వైద్యుల నిర్లక్ష్యం
  • లాప్రోస్కోపిక్ సర్జరీ సమయంలో తప్పిదం
  • సర్జన్, మత్తు వైద్యులదే బాధ్యత అని తేల్చిన వినియోగదారుల కమిషన్
  • మరణించిన రోగి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆదేశం
Gujarat doctors told to pay Rs 33 lakh for patient death

వైద్యులు ఉన్నది ప్రాణం పోయడానికే. తమ వంతు ప్రయత్నం చేసినా ప్రాణం కాపాడలేని సందర్భాలు ఉంటాయి. కానీ, వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణం పోవడం అంటే అది క్షమించరానిది. అలాంటి ఓ కేసులో మరణించిన రోగి కుటుంబానికి రూ.33.70 లక్షలు పరిహారం చెల్లించాలని గుజరాత్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్పింది.

జోష్నాబెన్ పటేల్ అనే మహిళ కడుపులో నొప్పితో బాధపడుతూ వైద్యులను ఆశ్రయించింది. కడుపులో ట్యూమర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ట్యూమర్ ను తొలగించేందుకు లాప్రోస్కోపిక్ సర్జరీని సూచించారు. 2015 జూన్ 1న జామ్ నగర్ లోని కల్పనాభట్ హాస్పిటల్ లో సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత జోష్నాబెన్ పటేల్ ఆరోగ్యం విషమించింది. క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలించి, అక్కడి నుంచి ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో వేరే ఆసుపత్రికి ఆమెను తరలించారు. చివరికి ఆమె కన్నుమూసింది. 

లాప్రోస్కోపీ కి సంబంధించి పొట్ట భాగంలో మూడు రంధ్రాలతోపాటు, 14 సెంటీమీటర్ల కోత కూడా ఉన్నట్టు పోస్ట్ మార్టమ్ నివేదిక వెల్లడించింది. ఆసుపత్రి డిశ్చార్జ్ సమ్మరీలో మత్తు మందు వల్ల షాక్ కు గురైనట్టు ఉంది. దీంతో సర్జన్, ఫిజీషియన్, అనస్థీషియా వైద్యులకు వ్యతిరేకంగా జోష్నాబెన్ పటేల్ భర్త పరేష్ పటేల్ వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన భార్య ప్రాణాలు కోల్పోయినందున, పరిహారం ఇప్పించాలని కోరారు.

లాప్రోస్కోపిక్ సర్జరీ సమయంలో కార్బన్ డయాక్సైడ్ ఎంబోలిజం తలెత్తడం వల్ల జోష్నాబెన్ పటేల్ మరణించినట్టు కమిషన్ గుర్తించింది. చికిత్స సమయంలో వైద్యులు శ్రద్ధతో కూడిన ప్రయత్నాలు చేయడంలో విఫలమైనట్టు ప్రకటించింది. సమర్థవంతమైన సేవలు అందించని సర్జన్, మత్తుమందు వైద్యుడిది బాధ్యత అని తేల్చింది. ఈ కేసులో ఫీజిషియన్ తప్పిదం లేదని భావించింది. రోగి వయసు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూ.33.70 లక్షల పరిహారాన్ని ఖరారు చేసింది. దీన్ని 2015 నుంచి 10 శాతం వడ్డీతో 60 రోజుల్లోగా సర్జన్, అనస్థీషియా వైద్యుడు చెల్లించాలని తీర్పు చెప్పింది. న్యాయ ఖర్చుల కింద మరో రూ.25వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది.

More Telugu News