Virender Sehwag: సిక్స్ కొడితే బ్యాట్ తో కొడతానన్నాడు సచిన్.. నేనేం చేశానంటే..: సెహ్వాగ్

Virender Sehwag Reveals Mid pitch Talk with sachin During Multan Test vs Pakistan
  • ముల్తాన్ టెస్టులో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్న సెహ్వాగ్
  • సిక్సులకు ప్రయత్నించి గతంలో ఔట్ అయిన విషయాన్ని సచిన్ చెప్పాడని వెల్లడి
  • సిక్స్ కొట్టి ట్రిపుల్ సెంచరీ చేయడంతో సచిన్ సంతోషించాడని వ్యాఖ్య
వీరేందర్ సెహ్వాగ్.. దూకుడైన ఆటకు మారుపేరు. సిక్స్ కొట్టి సెంచరీని పూర్తి చేసే అరుదైన క్రికెటర్. ఒక పరుగు దగ్గర ఉన్నా.. 99 దగ్గర ఉన్న.. 299 దగ్గర ఉన్నా.. బాల్ ను బౌండరీ అవతలికి పంపాలన్న దానిపైనే ఆలోచించే ‘డాషింగ్ బ్యాట్స్ మన్’. కెరియర్ లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. అభిమానులను అలరించాడు. ఇటీవల తన అనుభవాలను పలు ఇంటర్వ్యూల్లో పంచుకుంటున్నాడు. తాజాగా సచిన్ కు, తనకు మధ్య మైదానంలో జరిగిన సరదా సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 

‘‘నేను మొదట్లో టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడేవాడిని. బంతిని బౌండరీకి తరలించడంపైనే నా ఆలోచన ఉండేది. అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఇదే ఆలోచనతో ఆడాను. సెంచరీ కొట్టాలంటే ఎన్ని బౌండరీలు కొట్టాలో లెక్క వేసుకునే వాడిని’’ అని సెహ్వాగ్ వివరించాడు. 

‘‘ఒకవేళ నేను 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. సెంచరీ చేయడానికి 10 బంతులు తీసుకుంటే.. ప్రత్యర్థికి నేను 10 అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది. అందుకే నేను బౌండరీలు కొట్టడానికి ప్రాధాన్యం ఇస్తా. సెంచరీ చేయకుండా అడ్డుకునేందుకు.. ప్రత్యర్థికి కేవలం రెండు అవకాశాలే ఇస్తా. అప్పుడు రిస్క్ పర్సంటేజ్ 100 నుంచి 20 శాతానికి తగ్గుతుంది’’ అని తెలిపాడు. 

‘‘నాకింకా గుర్తు ఉంది. అప్పుడు మేం ఆస్ట్రేలియాలో ఉన్నాం. సైమన్ కటిచ్ బౌలింగ్ లో కొన్ని సిక్స్ లు కొట్టాను. 195 పరుగులు చేశాను. సిక్స్ కొట్టి 200 పరుగుల మార్క్ ను చేరుకోవాలనుకున్నా. కానీ ఔటయ్యాను. ఆ మ్యాచ్ లో మేం ఓడిపోయాం’’ అని చెప్పాడు. 

‘‘తర్వాత పాకిస్థాన్ తో ముల్తాన్ లో జరిగిన టెస్టులో 6 నుంచి 7 సిక్సులు కొట్టాను. 100 పరుగులు పూర్తి చేశాను. అప్పుడు క్రీజ్ లో నాతోపాటు ఉన్న సచిన్.. ‘ఇంకో సిక్స్ కొట్టావనుకో.. నిన్ను బ్యాట్ తో నేను కొడతా’ అని అన్నాడు. ఎందుకని నేను అడిగాను. ‘ఆస్ట్రేలియాలో నువ్వు సిక్స్ కొట్టేందుకు ప్రయత్నం చేసినందువల్లే మనం మ్యాచ్ ఓడిపోయాం’ అని చెప్పాడు. దీంతో అప్పుడు 120 పరుగుల వద్ద ఉన్న నేను.. 295 కొట్టేదాకా సిక్స్ కొట్టలేదు’’ అని వివరించాడు. 

‘‘ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకునేందుకు సిక్స్ కొడతానని అప్పుడు సచిన్ తో అన్నాను. ఆశ్చర్యపోయిన సచిన్.. ‘నీకేమైన పిచ్చి పట్టిందా? ఇప్పటిదాకా ఇండియా నుంచి ఎవరూ ట్రిపుల్ సెంచరీ చేయలేదు’ అని చెప్పాడు.  ‘295 కూడా ఎవరూ చేయలేదు కదా’ అనే నేను చెప్పా’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్ లో ముందుకు వచ్చి సిక్స్ కొట్టి ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశానని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు సచిన్ తన కన్నా ఎక్కువగా సంతోషించాడని చెప్పాడు.

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో సెహ్వాగ్ సభ్యుడు. కెరియర్ లో 104 టెస్టులు ఆడి 8,586 పరుగులు, 251 వన్డేల్లో 8,273 పరుగులు, 19 టీ20ల్లో 394 పరుగులు చేశాడు. కొన్నేళ్లపాటు ఐపీఎల్ లోనూ ఆడాడు.
Virender Sehwag
Sachin Tendulkar
Multan Test
Pakistan
triple century
Team India

More Telugu News