ED: తప్పుడు ఆరోపణలతో దురుద్దేశపూర్వక ప్రచారం: కవిత

  • ఈడీ అధికారి జోగేంద్రకు లేఖ రాసిన కవిత
  • మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశానన్న ఆరోపణలు అబద్ధమని వెల్లడి
  • పాత ఫోన్లను అప్పగిస్తున్నట్లు లేఖలో పేర్కొన్న ఎమ్మెల్సీ
  • విచారణకు సంబంధించిన లీకులతో తన ప్రతిష్టను తగ్గిస్తున్నారని విమర్శ
BRS mlc kavitha letter to ED officials

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరే ముందు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత లేఖ రాశారు. తప్పుడు ఆరోపణలతో దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ అందులో మండిపడ్డారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపారు. తనకు కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా, ఫోన్లు ఇవ్వాలని అడగకుండా పాత ఫోన్లన్నీ ధ్వంసం చేశానని ఆరోపించారని లేఖలో పేర్కొన్నారు. 

‘అధికారులు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నా సరే గతంలో నేను వాడిన ఫోన్లను అందజేస్తున్నా. ఓ మహిళ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం గోప్యతకు భంగం కలిగించడమే. ఈ ఏడాది మార్చిలో నన్ను విచారణకు పిలిచారు. కానీ ఫోన్లు ధ్వంసం చేశానంటూ నాపై గతేడాది నవంబర్ లోనే ఆరోపించారు. ఇది దురుద్దేశంతో చేసినదని స్పష్టంగా తెలిసిపోతోంది. విచారణకు సంబంధించి మీడియాకు లీకులు ఇవ్వడం వల్ల నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. నాతో పాటు మా పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమే ఇది. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ ప్రయోజనాలకు దూరంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థ ఇలా తన విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం’ అని కవిత తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News