New Delhi: ఢిల్లీ ప్రజలంటే ఎందుకంత కోపం అంటూ మోదీకి కేజ్రీవాల్ లేఖ

  • రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపణ
  • దేశ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని ఆవేదన 
  • బడ్జెట్ కు క్లియరెన్స్ ఇవ్వాలని లేఖలో కోరిన ఢిల్లీ సీఎం
Kejriwal writes to PM Modi after Centre halts Delhi Budget

ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను నిలిపివేయడం ఇదే తొలిసారి అన్నారు. ఢిల్లీ ప్రజలపై మీకెందుకు కోపం అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు చేతులు జోడించి వేడుకుంటున్నారనీ, దయచేసి త‌మ బడ్జెట్ ను ఆమోదించండని ఆయ‌న కోరారు. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది. బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ను క్లియర్ చేయడానికి ముందు... మౌలిక సదుపాయాల కంటే ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చు ఎందుకు ఎక్కువ ఉందో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం వివరణను కేంద్రం కోరింది. 

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రధానికి లేఖ రాశారు. ఢిల్లీవాసులమైన మాపై మీకెందుకు కోపం అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు తమ బడ్జెట్‌ను ఆమోదించాలని చేతులు జోడించి ప్రధానిని అభ్యర్థిస్తున్నారని ఆయన అన్నారు. ఓ జాతీయ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న వీడియోను ఆప్ సోమవారం షేర్ చేసింది. మంగళవారం (మార్చి 21) నాడు ఢిల్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గూండాగిరి చేస్తోందని, దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిలిపివేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టతను ఇవ్వనంత వరకు, బడ్జెట్‌కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం పెండింగ్‌లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

More Telugu News