ED: సుప్రీంకోర్టు అడ్వొకేట్ రాకేష్ చౌదరితో కవిత భేటీ

  • ఈడీ విచారణ తీరును వివరించి న్యాయ సలహా కోరిన ఎమ్మెల్సీ
  • ఓ మహిళను ఈడీ గంటల తరబడి విచారిస్తే ఏమీ చేయలేమా అని అడిగినట్లు సమాచారం
  • భేటీ ముగిశాక తిరిగి కేసీఆర్ ఇంటికి.. మరికాసేపట్లో ఈడీ ఆఫీసుకు కవిత
mlc kavitha meets supreme court advocate rakesh choudari

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై సుప్రీంకోర్టు అడ్వొకేట్ రాకేష్ చౌదరితో ఎమ్మెల్సీ కవిత మంగళవారం సంప్రదింపులు జరిపారు. ఉదయం రాకేష్ చౌదరి ఆఫీసుకు వెళ్లిన కవిత.. ఆయనతో భేటీ అయ్యారు. అధికారుల విచారణ తీరును వివరించి న్యాయ సలహా కోరారు. అనుమానితురాలిగా పిలిచి గంటలకు గంటలు విచారణ చేయడంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఓ మహిళను ఇలా గంటల తరబడి ఈడీ విచారిస్తే ఏమీ చేయలేమా అని అడిగినట్లు సమాచారం. రాకేష్ చౌదరితో భేటీ తర్వాత ఎమ్మెల్సీ కవిత తిరిగి కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. మరికాసేపట్లో కవిత ఈడీ ఆఫీసుకు బయల్దేరనున్నారు.

సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అనంతరం మంగళవారం ఉదయం మరోమారు విచారణకు రమ్మంటూ ఎమ్మెల్సీకి అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత న్యాయ సలహా కోసం సుప్రీంకోర్టు అడ్వొకేట్ తో సమావేశమయ్యారు. మంగళవారం విచారణ మొత్తం కవిత మొబైల్ ఫోన్లపైనే కేంద్రీకృతం కానుందని తెలుస్తోంది. 

ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లను మార్చారని, మార్చేసిన ఫోన్లను ధ్వంసం చేశారని అధికారులు మొదటినుంచి ఆరోపిస్తున్నారు. అయితే, ఫోన్లను ధ్వంసం చేశారనే ఆరోపణలను కవిత కొట్టిపారేశారు. ఫోన్లన్నీ ఉన్నాయని చెప్పారు. వాటన్నింటినీ ఈరోజు అధికారులకు చూపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More Telugu News