Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

  • జగన్, వైసీపీ ఎమ్మెల్యేల పిచ్చి పరాకాష్టకు చేరిందన్న అచ్చెన్నాయుడు
  • రామగోపాల్ రెడ్డిది థ్రిల్లింగ్ విక్టరీ అన్న అశోక్ బాబు
  • చంద్రబాబుకు రుణపడి ఉంటానన్న చిరంజీవి రావు
Chandrababu appreciates MLC elections winners

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు అభినందించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. మరోవైపు, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబుగారి అనుభవం, మన అభ్యర్థుల పోరాటం, కార్యకర్తలు, నేతల ధైర్యం, వారి పనితీరుతోనే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించామని చెప్పారు. టీడీపీ గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ ఎప్పుడూ నిలవలేదని... కానీ జగన్ అరాచకాలను చూసిన తర్వాత బరిలో నిలిచామని అచ్చెన్న చెప్పారు. ఈ ఎన్నికలను చంద్రబాబు రాత్రింబవళ్లు పర్యవేక్షించారని తెలిపారు. టీడీపీకి ఓటేస్తే విశాఖ రాజధాని కాకుండా పోతుందని వైసీపీ ప్రచారం చేసినా ఉత్తరాంధ్రలో టీడీపీ ఘన విజయం సాధించిందని చెప్పారు. టీడీపీ మూడు ఎమ్మెల్సీలు గెలిచిందన్న అక్కసుతో జగన్, అతని ఎమ్మెల్యేలకు పిచ్చిపట్టిందని... ఆ పిచ్చి పరాకాష్టకు చేరి నేడు శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారని విమర్శించారు. 

టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ... డబ్బు, ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవొచ్చనే అభిప్రాయాన్ని టీడీపీ అభ్యర్థులు మార్చేశారని చెప్పారు. పశ్చిమ రాయలసీమ అభ్యర్థి రామగోపాల్ రెడ్డిది థ్రిల్లింగ్ విక్టరీ అని అన్నారు. చంద్రబాబు అనుభవంతో రాయలసీమలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని చెప్పారు. 

పేద కుటుంబం నుంచి వచ్చిన తనపై నమ్మకముంచి, చట్టసభలకు పంపిస్తున్న చంద్రబాబుకు రుణపడి ఉంటానని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిచిన చిరంజీవి రావు అన్నారు. తనను గెలిపించిన వారి నమ్మకాన్ని వమ్ముచేయనని, తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పోరాడతానని చెప్పారు. 

తూర్పు రాయలసీమ నుంచి గెలిచిన కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఈ ఎన్నికలను ఒక కేస్ స్టడీగా తీసుకోవాలని చెప్పారు. చంద్రబాబును మళ్లీ సీఎంను చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం కష్టపడి పని చేస్తానని చెప్పారు. తన తండ్రి ఈనాడులో పని చేస్తూ టీడీపీతో అనుబంధాన్ని కొనసాగించారని తెలిపారు. తాము ముందు నుంచి జాగ్రత్తగా వ్యవహరించి ఒక ప్రణాళికతో పట్టభద్రుల ఓట్లను చేర్పించామని చెప్పారు.

More Telugu News