Andhra Pradesh: మాపై దాడి చేసి మమ్మల్నే దోషులుగా ప్రచారం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

  • అసెంబ్లీలో గొడవపై ప్రెస్ మీట్ లో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే
  • వైసీపీ ఎమ్మెల్యేలు మా శాసన సభ్యులపై దాడి చేశారు..
  • స్పీకర్ పై మేం దాడి చేశామనడం అబద్ధం
  • వీడియో ఫుటేజీలు బయటపెట్టాలని స్పీకర్ కు డిమాండ్
tdp mla Atchannaidu press meet on assembly issue

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సోమవారం తెలిపారు. మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోపల మాపై దాడి జరిగింది, బయటేమో వాళ్ల మీడియా మమ్మల్నే దోషులుగా చిత్రీకరిస్తోంది. మా ఎమ్మెల్యేలపై అత్యంత దారుణమైన పద్ధతిలో దాడి జరిగితే, మేమే స్పీకర్ పై దాడి చేశామని ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. జీవో 1 ను రద్దు చేయాలంటూ పోడియం దగ్గర నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. అయితే, తమ నిరసన వల్ల సభా కార్యక్రమాలు నిలిచిపోతే తీర్మానం పాస్ చేసి మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిందని అచ్చెన్నాయుడు చెప్పారు. అలా కాకుండా మమ్మల్ని కొట్టే.. కొట్టించే అధికారం స్పీకర్ కు లేదని మండిపడ్డారు.

సోమవారం శాసన సభలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఫుటేజీ మొత్తం పరిశీలించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను అచ్చెన్నాయుడు కోరారు. తమ ఎమ్మెల్యేలు ఎవరైనా స్పీకర్ పై దాడి చేస్తే వారిని శాసనసభలోనే ఉరితీయండని సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేసిన శాసన సభ్యులను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయించాలని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు స్పీకర్ ను డిమాండ్ చేశారు.

More Telugu News