Narendra Modi: జర్మన్ ఎంబసీ ‘నాటు నాటు’ డ్యాన్స్ పై .. మోదీ స్పందన ఇదే!

  • ఢిల్లీ చాందినీ చౌక్ లో నాటు నాటు పాటకు స్ట్రీట్ డ్యాన్స్ చేసిన జర్మన్ ఎంబసీ సిబ్బంది
  • జర్మన్ అంబాసిడర్ ట్వీట్ కు స్పందించిన ప్రధాని
  • జర్మన్లు డ్యాన్స్ బాగా చేస్తారంటూ ప్రశంసలు
PM Modi Praises German Embassys Dance On Naatu Naatu

పేరుకు తగ్గట్లే ప్రేక్షకుల మనసుల్లో నాటుకుని పోతోంది ‘నాటు నాటు’ పాట. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత మరింత మందికి చేరువైంది. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఢిల్లీలో కొరియా దౌత్య సిబ్బంది ఈ పాటకు డ్యాన్స్ చేయగా.. తాజాగా జర్మనీ దౌత్య సిబ్బంది కూడా కాలు కదిపారు. జర్మన్ ఎంబసీ ఉద్యోగులతో కలిసి జర్మనీ రాయబారి.. ఢిల్లీ చాందినీ చౌక్ లో నాటు నాటు పాటకు స్ట్రీట్ డ్యాన్స్ చేశారు. 

అందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసిన జర్మన్ అంబాసిడర్ ఫిలిప్ అకర్ మన్.. ‘‘జర్మన్లు డ్యాన్స్ చేయలేరా? ఓల్డ్ ఢిల్లీలో నేను, ఇండో జర్మన్ టీమ్ కలిసి నాటు నాటు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. అంత పర్ఫెక్ట్ గా లేకపోవచ్చు. కానీ ఫన్ కదా..!’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు బదులిచ్చారు. 

జర్మన్లు బాగా డ్యాన్స్ చేస్తారంటూ ప్రధాని పొగడ్తలు కురిపించారు. ‘‘భారతదేశపు రంగులు, రుచులు! జర్మన్లు కచ్చితంగా డ్యాన్స్ చేయగలరు. బాగా చేస్తారు కూడా!’’ అని ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సహా ఎంతో మందికి జర్మన్ల డ్యాన్స్ వీడియో నచ్చింది. చాలా మంది రీట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు.

More Telugu News