సజ్జల శుభం పలికారు: పయ్యావుల

  • ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయన్న సజ్జల
  • అధికారంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యలు
  • ప్రజల దెబ్బకు సజ్జలకు గతం గుర్తొచ్చిందన్న పయ్యావుల
  • ఈ విజయం టీడీపీలో బాధ్యతను పెంచిందని వెల్లడి
Payyavula satires on Sajjala

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని, ఈ పరిణామాలు చూస్తుంటే తాము అసలు అధికారంలో ఉన్నామా...? అనే అనుమానం కలుగుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. 

అధికారంలో ఉన్నామా...? అనే అనుమానం సజ్జలకు కలగడం శుభ పరిణామం అని అన్నారు. రెండ్రోజల ముందే ప్రజలు ఉగాది పంచాంగం చెప్పారని చంద్రబాబు కామెంట్ చేశారని, చంద్రబాబు వ్యాఖ్యలకు సజ్జల మరింత బలం చేకూర్చారని ఎద్దేవా చేశారు. 

"ఈ రాష్ట్రంలో అరాచకం ఉందని ప్రజలెప్పుడో గుర్తించారు. ఆ ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వై నాట్ 175 అనే గొంతులు మూగబోయాయి. ప్రజలు, ప్రజాస్వామ్యం అనే పదాలు వైసీపీ డిక్షనరీలోనే లేవు. వైసీపీ డిక్షనరీలో లేని పదాలను సజ్జల మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. ఒక్క షాకుతోనే ప్రజలు సజ్జలకు గతాన్ని గుర్తు చేశారు... ప్రజలు, ప్రజాస్వామ్యం తదితర పదాలను గుర్తు చేశారు. 

బుల్డోజ్ అనేది వైసీపీ ఇంటి పేరు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ పై చేసిన అరాచకం నుంచి ఎన్నికల్లో గెలిచిన పశ్చిమ రాయలసీమ అభ్యర్థిని లాక్కెళ్లి అరెస్ట్ చేయడం వరకు బుల్డోజ్ చేయడం కాదా...? ఈ ఫలితాలతో అధికార పార్టీ మరిన్ని అరాచకాలు చేస్తుందని మేం నమ్ముతున్నాం... ఏంచేసినా మేం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం. 

మీ పార్టీ ఎమ్మెల్యేల మీద సీఎంకే నమ్మకం లేదు. అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులని పర్యవేక్షకులుగా పెట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారు...? ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి... మా సంఖ్యా బలం 23. మా దగ్గరున్న ఎమ్మెల్యేలను లాక్కుంది ఎవరు...? పోటీ చేయడాన్ని కూడా తప్పు పడతారా...? మీ ఓటర్లు వేరా...? ముఖం మీద ఎవరైనా మేం ఫలానా ఓటరని స్టిక్కర్ వేసుకుంటారా...? 

పులివెందుల నుంచి ఓ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి గెలిచారు... త్వరలో మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ నుంచి గెలవబోతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను పెంచాయి" అని పయ్యావుల పేర్కొన్నారు.

More Telugu News