Mlc election: డిక్లరేషన్ అందుకున్న రాంగోపాల్ రెడ్డి

  • అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో డిక్లరేషన్ అందించిన కలెక్టర్ నాగలక్ష్మి
  • పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి
  • శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగిన హైడ్రామా.. టీడీపీ నేతల అరెస్టు
Mlc Ramgopal reddy got declaration form from collector

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎట్టకేలకు డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అనంతపురం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ ఫారంను రాంగోపాల్ రెడ్డికి అందజేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై శనివారం రాత్రి నుంచి కొనసాగుతున్న టెన్షన్ తొలగిపోయింది. 

శనివారం సాయంత్రమే ఎన్నికల ఫలితం ప్రకటించినా.. రాంగోపాల్ రెడ్డి గెలిచారని వెల్లడించిన అధికారులు ఆయనకు డిక్లరేషన్ ఫారం మాత్రం అందించలేదు. దీనిపై శనివారం రాత్రంతా హైడ్రామా నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించారు.

రాంగోపాల్ రెడ్డి ఏమన్నారంటే..
"పదహారో తేదీన మొదలైన కౌంటింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. 7,450 ఓట్ల మెజారిటీతో నేను గెలుపొందినట్లు 7 గంటలకు ప్రకటించారు. ఫలితాల వివరాలను వెల్లడించాల్సిన రిటర్నింగ్ అధికారి మమ్మల్ని వేచి ఉండాలని చెప్పారు. డిక్లరేషన్ ఫారం ఇస్తామని రాత్రి 10:30 గంటల వరకు వెయిట్ చేయించారు. ఇంతలో ఎస్పీగారు అక్కడికి వచ్చారు. ఆ తర్వాత డిక్లరేషన్ ఫారం ఎప్పుడిస్తారంటూ అధికారులను ప్రశ్నించాం.. అయితే, తమకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాకే ఫారం అందిస్తామని అధికారులు చెప్పారు. దీంతో ఎన్నికల ఫలితాలను మార్చే కుట్ర జరుగుతోందని ఆందోళన చేశాం" అని ఎమ్మెల్సీగా గెలుపొందిన రాంగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టర్ ఆఫీసు నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఈ రోజు కలెక్టరేట్ లోనే డిక్లరేషన్ ఫారం అందిస్తామని చెప్పారని రాంగోపాల్ రెడ్డి తెలిపారు.

More Telugu News