Earthquake: పెరు, ఈక్వెడార్‌లను కుదిపేసిన భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. 12 మంది మృత్యువాత

  • ఈక్వెడార్‌లో భారీగా ఆస్తినష్టం
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • 6.8 తీవ్రతతో భూమికి 66 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
 Massive Earthquake Hits Peru and Ecuador Buildings Destroyed

పెరు, ఈక్వెడార్‌లను నిన్న భారీ భూకంపం కుదిపేసింది. శక్తిమంతమైన ఈ భూకంపం కారణంగా భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈక్వెడార్‌లోని మాచల, క్యుయెంకా తదితర నగరాల్లో ఎక్కడ చూసినా శిథిలాలు దర్శనమిస్తున్నాయి. భూకంపంతో వణికిపోయిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి రోడ్లపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. 12.12 గంటలకు దాదాపు 41 మైళ్ల (66 కిలోమీటర్ల)  లోతున ఈ భూకంపం సంభవించినట్టు పేర్కొంది. 

భూకంప కేంద్రం పెరు సరిహద్దుకు సమీపంలో ఈక్వెడార్‌ మునిసిపాలిటీలోని బాలావోలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 12 మంది మరణించారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాయాక్విల్, క్విట్, మనాబి, మాంతా వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. 

ఈక్వెడార్‌లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించగా, పెరులో మాత్రం పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఇక్కడ తక్కువ తీవ్రతతో భూమి కంపిచడమే అందుకు కారణం. కాగా, భూకంప తీవ్రత 7.0గా ఉన్నట్టు తొలుత పెరు సీస్మోలాజికల్ అధికారులు తెలిపారు. అయితే, కొన్ని గంటల తర్వాత తీవ్రతను 6.7గా పేర్కొన్నారు.

More Telugu News