‘నాటునాటు’ కూడా ఓ పాటేనా?.. కీరవాణి తండ్రి తీవ్ర విమర్శలు

  • ఆ పాటలో మ్యూజిక్ ఎక్కడుందన్న శివశక్తి దత్తా
  • విధి విలాసం, విధి విచిత్ర వైచిత్యం అని వ్యాఖ్యలు
  • తన కుమారుడు ఇన్నాళ్లు చేసిన కృషికి ఇలా ప్రతిఫలం దక్కిందన్న దత్తా
  • ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ అద్భుతమని ప్రశంస
Keeravani Father Siva Shakti Datta Criticised Naatu Naatu Song

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ప్రపంచం మొత్తం బ్రహ్మరథం పట్టింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకుంది. అయితే, ఆ పాటను కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మాత్రం ఇదికూడా ఓ పాటేనా? అని విమర్శలు గుప్పించారు. ట్రిపులార్ సినిమాలోని ‘రామం రాఘవం’ పాటను రాసింది ఆయనే. 

‘నాటునాటు’ పాటకు అవార్డు రావడంపై మీ స్పందనేంటన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. ‘అదొక పాటా?’ అని తీసి పారేశారు. ‘‘అదొక పాటా? అందులో మ్యూజిక్ ఎక్కడుంది నా ముఖం! ఇది ఒక విధి విలాసం. విధి విచిత్ర వైచిత్యం’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, తన కుమారుడు కీరవాణి చేసిన కృషికి ఈ పురస్కారం రూపంలో ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. 

నాటునాటు పాటలో సంగీతం, సాహిత్యం కంటే కొరియోగ్రఫీ తనకు బాగా నచ్చిందని శివశక్తి దత్తా అన్నారు. నటులు రామ్‌చరణ్, ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ అద్భుతమని కొనియాడారు. ఇందుకు గాను నృత్య దర్శకుడికి ప్రశంసలు దక్కాలని అన్నారు. ‘‘చంద్రబోస్ రాసిన ఐదు వేల పాటల్లో అదొక పాటా? కీరవాణి సంగీతం అందించిన పాటల్లో అదొక పాటా? అదొక సంగీతమా’’ అని దత్తా తీవ్ర విమర్శలు చేశారు.

More Telugu News