Revanth Reddy: ప్రశ్నాపత్రం లీక్ వెనుక బీఆర్ఎస్ పెద్ద తలకాయలు ఉన్నాయి: రేవంత్ రెడ్డి

Revanth Reddy slams KTR over TSPSC question papers leakage
  • టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి ప్రకంపనలు
  • లీకేజికి ఇద్దరే కారణమన్న కేటీఆర్
  • 9 మందిని అరెస్ట్ చేస్తే... ఇద్దరే అని కేటీఆర్ ఎలా చెబుతారన్న రేవంత్
  • బీఆర్ఎస్ పెద్ద తలకాయలను కేటీఆర్ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
తెలంగాణలో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పలు ఉద్యోగ నియామకాల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ కేసులో చిన్న చిన్న వాళ్లను అరెస్ట్ చేయడం కాదని, ప్రశ్నాపత్రం లీకేజి వెనుక ఉన్న బీఆర్ఎస్ పెద్ద తలకాయలు బయటికి రావాలని అన్నారు. ఈ తతంగం వెనుక ఉన్న తిమింగలాలకు బహిరంగ శిక్ష విధించాలని పేర్కొన్నారు. 

కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి రాజంపేట గ్రామంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పైరవీకారులకు ముందే ప్రశ్నాపత్రాలు అందుతున్నాయని తెలిపారు. ఘటనకు బాధ్యుడైన మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

తాను ఐటీ మంత్రినని, ఈ వ్యవహారంతో తనకేంటి సంబంధం అని కేటీఆర్ అంటున్నారు... మరి ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్ష జరిపితే నువ్వెందుకు హాజరయ్యావు? అని కేటీఆర్ ను నిలదీశారు. నీకేమీ సంబంధం లేకపోతే ఇవాళ ఒకవైపు విద్యాశాఖా మంత్రిని, మరోవైపు ఎక్సైజ్ శాఖామంత్రిని ఎందుకు కూర్చోబెట్టుకుని మాట్లాడావు? ఐటీ మంత్రివి అయిన నీవు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సమీక్ష సమావేశంలో సిట్ అధికారులను ఎందుకు కూర్చోబెట్టలేదు? అని ప్రశ్నించారు. 

ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేస్తే, ఇద్దరే నేరానికి పాల్పడ్డారని మంత్రిగా ఏ విధంగా ప్రకటన చేస్తారు? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇప్పటివరకు ఆ 9 మందిని విచారణ చేయలేదని, మరి కేటీఆర్ ఇద్దరే ఈ తప్పిదానికి పాల్పడ్డారని ఎలా చెబుతారని వ్యాఖ్యానించారు. 

కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని దీనితో స్పష్టమైందని అన్నారు. కేటీఆర్ తన ప్రకటన ద్వారా బీఆర్ఎస్ లో ఉన్న పెద్ద తలకాయలను కాపాడారని రేవంత్ ఆరోపించారు. అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికే కేటీఆర్ ఈ ప్రకటన చేశారా? ఇంటి దొంగలు బయటపడతారనే కేటీఆర్ హడావుడి చేస్తున్నారు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
Revanth Reddy
KTR
TSPSC
Question Papers
Leakage
Congress
BRS
Telangana

More Telugu News