Kavitha: మెట్రో పిల్లర్లపై కవితకు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం!

posters against mlc kavitha in begumpet metro pillars
  • హైదరాబాద్ బేగంపేటలో ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు
  • మెట్రో పిల్లర్లపై అతికించిన గుర్తు తెలియని వ్యక్తులు
  • ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో వెలసిన పోస్టర్లు, హోర్డింగులు 
హైదరాబాద్ లో మరోసారి ‘పొలిటికల్ పోస్టర్లు’ కలకలం రేపాయి. ఇటీవల కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి.

హైదరాబాద్ బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. శనివారం ఉదయాన్నే ఈ పోస్టర్లు కనిపించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను కవిత ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్టర్లు మెట్రో పిల్లర్లపై కనిపించడం కలకలం రేపుతోంది.

‘కల్వకుంట్ల దొంగల ముఠా.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆర్’.. ‘కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే.. మద్యం’.. ‘కవితక్క నీకు కావాలి సారా దందాలో 33 శాతం వాటా.. దాని కోసమే ఆడుతున్నావ్ 33 శాతం మహిళా రిజర్వేషన్ ఆట’.. ‘తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకుని.. ఢిల్లీలో కవితక్క చేస్తోంది దొంగ సారా దందా’ అంటూ వాటిపై రాసుకొచ్చారు. 

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే పోస్టర్లను తొలగించారు. సీసీ కెమెరాలను పరిశీలించి.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా, ఇప్పుడు కవితకు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లలో ఎక్కడా ఊరు పేరు లేకపోవడం గమనార్హం.
Kavitha
posters against mlc kavitha
begumpet metro pillars
BRS
KCR
BJP

More Telugu News