vaccine: పిల్లలకు వేయించాల్సిన ముఖ్యమైన 10 టీకాలు.. ఎప్పుడెప్పుడు వేయించాలంటే..!

  • వ్యాధుల నుంచి కాపాడేందుకు టీకాలు తప్పనిసరి!
  • పుట్టిన గంటలోపు వేయించాల్సిన టీకా బీసీజీ
  • పోలియో చుక్కల మందుతో పాటు వ్యాక్సిన్ కూడా వేయించాల్సిందే
These are the vaccinations that must be given to your children from birth to adulthood

వ్యాధుల బారిన పడకుండా తీసుకునే ముందుజాగ్రత్తలలో టీకా ఒకటి. బాల్యంలో టీకా తీసుకోవడం వల్ల పెద్దయ్యాక ఆ వ్యాధిని దరిచేరకుండా చూసుకోవచ్చు. అందుకే పిల్లలు పుట్టినప్పటి నుంచి పలు రకాల టీకాలు వేయించాలని వైద్యులు సూచిస్తుంటారు. వయసుతో పాటూ టీకాలు క్రమం తప్పకుండా వేయించాలని హెచ్చరిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలకు ఇవ్వాల్సిన పది టీకాలు.. వాటిని ఏ వయసులో ఇవ్వాలో తెలుసుకుందాం.

బీసీజీ టీకా
టీబీ నుంచి కాపాడేందుకు ఇచ్చే టీకా పేరే బీసీజీ.. ఈ టీకా అత్యంత ప్రభావవంతమైనదని వైద్యులు చెబుతున్నారు. మన దేశంలో టీబీ వ్యాప్తి ఎక్కువే, పైగా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే లక్షణం టీబీకి ఉంది. ఈ నేపథ్యంలో టీబీ వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతైనా అవసరమే. ఆరు నెలల వయసు వరకు ఎప్పుడైనా ఈ టీకా వేయించుకోవచ్చు. అయితే, పుట్టిన గంట లోపలే బీసీజీ వ్యాక్సిన్ వేయడం ద్వారా ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని తెలిపారు. 1948లో బీసీజీ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రతీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ వేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది.

హెపటైటిస్ బి టీకా
కాలేయాలనికి సంబంధించిన ఇన్ ఫెక్షన్ హెపటైటిస్.. ఈ వ్యాధి సోకితే జీవితాంతం ఇబ్బంది పెడుతుంది. ఈ ఇన్ ఫెక్షన్ ను దూరంపెట్టడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ను 2002 లో ప్రభుత్వం విడుదల చేసింది. నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లోనూ ఈ టీకాను చేర్చారు. బిడ్డ పుట్టిన 24 గంటల్లోగా ఈ వ్యాక్సిన్ వేయించాలి. 

ఓరల్ పోలియో వ్యాక్సిన్
మన దేశం పోలియో రహిత దేశంగా మారిందంటూ 2014 లో కేంద్రం ప్రకటించింది. భవిష్యత్తులో మరోమారు పోలియో ఇబ్బంది పెట్టకుండా కేంద్ర ఆరోగ్య శాఖ పోలియో డ్రైవ్ లను చేపడుతోంది. పిల్లలు పుట్టిన 25 రోజుల్లోగా వీలైనంత తొందరగా పోలియో చుక్కలు వేయించాలి. 

పెంటావాలెంట్ టీకా
ఐదు యాంటీజెన్ ల కలయికతో రూపొందించిన వ్యాక్సిన్ పెంటావాలెంట్ టీకా.. డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్, హెపటైటిస్ బి హేమోఫిలస్, ఇన్‌ఫ్లుయెంజా టైప్ బి. దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపించే డిఫ్తీరియా అనే వైరస్ పిల్లల ముక్కు, గొంతుపై ప్రభావం చూపుతుంది. చిన్నపిల్లల గుండె, కిడ్నీ, కాలేయం దెబ్బ తింటాయి. ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు సాయపడడంతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రభావాన్ని కూడా పెంచుతుంది. మూడు విడతలుగా అందించే ఈ డోసులలో ఫస్ట్ డోసును బిడ్డ ఆరు వారాల వయసులోపు వేయించాలి. పది వారాల్లో మరో డోసు, పద్నాలుగు వారాలలో మూడో డోసును ఇప్పించాలి.

రోటావైరస్ టీకా
రోటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే వైరస్. పార్క్ లేదా డేకేర్ సెంటర్ వంటిచోట్ల పిల్లలు ఆడుకునేటప్పుడు సోకే ప్రమాదం ఎక్కువ. దీని వల్ల జ్వరం, తిమ్మిర్లు, వాంతులు విరేచనాలు సంభవించవచ్చు. పెంటావాలెంట్ వ్యాక్సిన్ లాగా రోటావైరస్ వ్యాక్సిన్ భారత ప్రభుత్వం పిల్లలకు అందిస్తోంది. బిడ్డకు పది వారాల వయసులో ఒకటి, 14 వారాల వయసులో మరొకటి వేయించాలి.

న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్
న్యమోనియా సహా పలు ప్రమాదకర వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్. దీనినే పీసీవీ వ్యాక్సిన్ అంటుంటారు. 6 వారాల వయసులో తొలి డోసును, 14 వారాల వయసులో రెండో డోసును వేయించాలి.

మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్
మీజిల్స్ - రూబెళ్లా (ఎంఆర్) వ్యాక్సిన్ ఇది భారతదేశంలో రెండు మోతాదులలో ఇస్తారు. మొదటి షాట్ 9 నుండి 12 నెలలకు ఇస్తుండగా, పిల్లలకు 2 ఏళ్లకు ముందు రెండోది ఇస్తున్నారు.

నిష్క్రియాత్మక పోలియో వ్యాక్సిన్
పోలియోవైరస్‌ను పూర్తిగా నిర్మూలించే మరో ప్రయత్నంలో, భారతదేశం 2015లో ఐపీవీని ప్రవేశపెట్టింది. నోటి టీకాలా కాకుండా వైద్యులు శరీరంలోకి ఐపీవీని ఇంజెక్ట్ చేస్తారు. ఆరు వారాల వయసులో తొలి డోసు, 14 వారాల వయసులో రెండో డోసు వేస్తారు.

జపనీస్ ఎన్ సెఫాలిటిస్ వ్యాక్సిన్(జేఈ)
దోమల ద్వారా అంటుకునే వ్యాధి జపనీస్ ఎన్ సెఫాలిటిస్.. మన దేశంలో కొన్నిచోట్ల ఈ వ్యాధి పిల్లల మరణాలకు కారణమవుతోంది. బిడ్డ వయసు 9 నెలలు దాటిన తర్వాత 12 నెలల లోపు ఈ వ్యాక్సిన్ వేయించాలి. 

విటమిన్ ఏ టీకా
దేశంలోని పిల్లలకు అత్యంత ముఖ్యమైన, తప్పకుండా ఇప్పించాల్సిన టీకా ఇది. విటమిన్ ఏ లోపం పిల్లల్లో అంధత్వానికి దారితీస్తుంది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఈ టీకా తొలి డోసును వేయించాలి.

More Telugu News