AP Assembly Session: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

TDP members suspended from AP assembly for the fifth consecutive  day
  • సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చించాలంటూ టీడీపీ సభ్యుల డిమాండ్
  • స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నిరసన
  • సభలో గందరగోళం
  • టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలన్న బుగ్గన ప్రతిపాదనకు స్పీకర్ ఆమోదం

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. మొత్తం 11 మందిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన తొలుత ప్రతిపాదించారు. అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, చినరాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగూపూడి, మంతెన రామరాజు, సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయ, గద్దె రామ్మోహన్‌ను సస్పెండ్ చేయాలంటూ బుగ్గన సూచించడంతో స్పీకర్ ఈ మేరకు వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడం ఇది వరుసగా అయిదోసారి. 

క్వశ్చన్ అవర్ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చ జరగాలని పట్టుబట్టారు. అయితే.. టీడీపీ సభ్యుల ప్రతిపాదన సభాసంప్రదాయాలకు విరుద్ధమని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. సభాసమయాన్ని వృథా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనల గురించీ చర్చించాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో.. సభలో గందరగోళం మొదలైంది. 

టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమ నిరసన తెలియజేశారు. ఆ తరువాత టీడీపీ సభ్యుల్లో కొందరు స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి తమ ఎజెండా కాపీలను చింపి నిరసన తెలిపారు. దీంతో..ఈ విషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ సభను కోరారు. ఇంతలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ..సభాసమయాన్ని వృథా చేయడం సరికాదని టీడీపీ సభ్యులకు మరోసారి సూచించారు. 

టీడీపీ సభ్యులు మాత్రం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు కారణం ఏంటో చెప్పాలని పట్టుబట్టారు. స్వప్రయోజనాలకా? రాష్ట్ర ప్రయోజనాల కోసమా? అంటూ తమ నిరసనను కొనసాగించారు. ఇలా సభలో గందరగోళం కొనసాగుతుండటంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించడం, స్పీకర్ ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి.

  • Loading...

More Telugu News