ఏపీ, తెలంగాణలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు!
- అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ
- ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం
- తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి
ఏపీలో పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని, వర్షాలకు ఇదే కారణమని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.