West Bengal: కేరళలో పశ్చిమ బెంగాల్ కూలీకి రూ. 75 లక్షల జాక్‌పాట్.. భయంతో పోలీస్ స్టేషన్‌కు పరుగు!

  • రోడ్డు నిర్మాణ పనుల్లో కూలీగా చేస్తున్న బాదేశ్
  • రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన పశ్చిమ బెంగాల్ వ్యక్తి
  • తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విన్నపం
  • డబ్బులు రాగానే సొంతూరు వెళ్లిపోతానన్న కార్మికుడు
Bengal laborer won the jackpot of 75 lakhs and then immediately reached the police station

పశ్చిమ బెంగాల్ కూలీకి కేరళలో రూ. 75 లక్షల లాటరీ తగిలింది. రాత్రికి రాత్రే అతడు లక్షాధికారిగా మారిపోయాడు. తనకు లాటరీ తగిలిన విషయం తెలిసి ఆనందంలో మునిగిపోయాడు. అయితే, ఆ వెంటనే అతడి వెన్నులో వణుకు మొదలైంది. తనను ఏమైనా చేసి లాటరీ టికెట్ లాక్కుంటారని భయపడ్డాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్‌కే బాదేశ్ బతుకుదెరువు కోసం కేరళ వచ్చాడు. ఎర్నాకుళంలోని చొట్టానికరలో రోడ్డు నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లాటరీ టికెట్లు కొనే అలవాటున్న బాదేశ్‌ కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్త్రీశక్తి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అతడు కొన్న టికెట్‌కు మంగళవారం రాత్రి రూ. 75 లక్షలు తగిలాయి. దీంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

మరోవైపు, భయం కూడా వేసింది. తనకు రూ. 75 లక్షల లాటరీ తగిలిన విషయం ఎవరికైనా తెలిస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడొచ్చని భయపడి సమీపంలోని మువట్టుపుళా పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. పోలీసులను కలిసి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. బాదేశ్‌కు లాటరీ టికెట్ క్లెయిమ్ చేసుకోవడమెలానో తెలియదని, దీనికితోడు టికెట్ ఎవరైనా లాక్కుని హాని తలపెడతారన్న భయంతోనే బాదేశ్ తమను ఆశ్రయించినట్టు పోలీసులు తెలిపారు. అతడికి సాయం చేస్తామన్నారు.

తనకు లాటరీ తగలడంపై బాదేశ్ స్పందిస్తూ.. డబ్బులు చేతికి అందిన తర్వాత స్వగ్రామం వెళ్లి తన ఇంటికి మరమ్మతులు చేయిస్తానని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పాడు.

More Telugu News