Atchannaidu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైపీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు: అచ్చెన్నాయుడు

  • ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీకి ఆధిక్యం
  • వైసీపీ మాయమాటలను ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదన్న అచ్చెన్న
  • ఓటుతో సీఎం జగన్ కు గుణపాఠం చెప్పారని వెల్లడి
Atchannaidu opines on MLC election trends

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వేపాడ చిరంజీవి ఆధిక్యంలో ఉండడం తెలిసిందే. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. 

మూడు రాజధానులు అంటూ వైసీపీ సర్కారు చెప్పిన మాయమాటలను ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదని తెలిపారు. తమకు కావాల్సింది రాజధాని కాదని, అభివృద్ధి అని ఓటుతో చాటిచెప్పడం ద్వారా సీఎం జగన్ కు తగిన గుణపాఠం నేర్పారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే, సీఎంకు కర్రు కాల్చి వాత పెట్టిన విధంగా ఉన్నాయని తెలిపారు. 

తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ చేశామని, అందులో రెండు స్థానాల్లో టీడీపీ విజయదుందుభి మోగించబోతోందని వెల్లడించారు. మూడో స్థానంలో కూడా తమనే విజయం వరిస్తుందన్న నమ్మకం కలుగుతోందని, రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 

"ఉత్తరాంధ్ర ప్రజలంటే అమాయకులని, ఏమీ తెలియనివాళ్లని ముఖ్యమంత్రి భావించారు. వారికి చెవులో పూలు పెట్టే విధంగా వ్యవహరించారు. మూడు రాజధానులూ అంటూ మోసం చేయబోయారు. ఆ ప్రాంతంలోని 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికీ వెళ్లి... మీరు టీడీపీకి ఓటేస్తే మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు భావిస్తామని చెప్పారు. ఇప్పుడదే జరిగింది. తమకు రాజధాని అక్కర్లేదని, అభివృద్ధి కావాలని వారు ఓటుతో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను" అని పేర్కొన్నారు.

More Telugu News