swapnalok Accident: ‘స్వప్నలోక్‌’ అగ్ని ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సీఎం కార్యాలయం
  • అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
  • బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ హామీ
  • క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకోవాలని మంత్రులకు ఆదేశం
CM KCR announces for 5 lakhs exgratia for families of victims died in swapnalok fire accident

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా ఓ ట్వీట్ చేసింది. అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది విచారకరమని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలతో పాటూ ఈ ఘటనలో గాయపడ్డ వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలంటూ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు సీఎం సూచించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. 

ప్రమాదం జరిగిందిలా.. 
సికింద్రాబాద్‌లోని రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్న‌లోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి 7,8 అంతస్తుల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్రమంగా ఐదు, ఆరు అంతస్తులకూ వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తుల్లో కొన్ని ప్రైవేటు కార్యాలయాలతో పాటూ దుస్తుల గోదాములు ఉన్నాయి. సిబ్బంది ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొందరు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా మరికొందరు భవంతిలోనే చిక్కుకుపోయారు. ఇక ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్వప్నలోక్ కాంప్లెక్స్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగారు. 

అగ్నికీలలు ఇతర భవనాలకూ వ్యాపించే అవకాశం ఉండటంతో సమీప భవనాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు నాలుగు గంటల పాటు సిబ్బంది శ్రమించి భవనంలో చిక్కుకుపోయిన మొత్తం 13 మందిని బయటకు తీసుకొచ్చారు. బాధితులను వివిధ ఆసుపత్రులకు తరలించగా కొందరు చికిత్స పొందుతూ అసువులు బాసారు. వీరంతా ఊపిరాడక మరణించినట్టు తెలిసింది. మృతుల్లో శివ, ప్రశాంత్, శ్రావణి, వెన్నెల, త్రివేణి, ఉన్నారు. మృతులందరూ ఇరవై ఐదేళ్ల లోపువారే కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి.

More Telugu News