Hyderabad: విశ్వనగరం అంటూ గొప్పలు చెబుతున్నారు.. ప్రజలకు కనీస భద్రత కల్పించడం లేదు: రేవంత్ రెడ్డి

  • స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై స్పందించిన రేవంత్, బండి సంజయ్
  • ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న రేవంత్ 
  • మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
Revanth reddy and Bandi sanjay reacts over swapnalok complex fire accident

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. భవిష్యత్‎లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్  సూచించారు. ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న యువత ఇలాంటి ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలా వరస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 

‘స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు చనిపోవడం బాధాకరం. ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు, పర్యవేక్షణలో జీహెచ్ఎంసీ వైఫల్యం చెందింది. నామమాత్రపు నోటీసులు, కంటి తుడుపు చర్యలతో ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చారు. కేసీఆర్ మొద్దు నిద్రవీడి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి‘ అని రేవంత్ ట్వీట్ చేశారు.

ప్రభుత్వం సరైన విచారణ, నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్లే నగరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విశ్వనగరం అంటూ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు కనీస భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. కుక్కలు ఒక పసివాణ్ని పీక్కుతిని చంపేసాయని, ఇప్పుడు అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టన పెట్టుకుందన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన భద్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News