V.V Lakshminarayana: పీఎంఎల్ఏ అనేది ప్రత్యేక చట్టం... కవిత విచారణకు వెళ్లాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • నేడు ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉన్న కవిత
  • కవిత హాజరుకాబోరన్న న్యాయవాది
  • ఈ నెల 20న విచారణకు రావాలంటూ ఈడీ మరో నోటీసు
  • సమను అందుకున్నప్పుడు విచారణకు వెళ్లాలన్న లక్ష్మీనారాయణ
  • పీఎంఎల్ఏ సెక్షన్ 60 కింద నోటీసులు ఇచ్చారని వెల్లడి
CBI Former JD Lakshminarayana opines on Kavitha issue

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కవిత విచారణకు హాజరుకాబోరని ఆమె తరఫు న్యాయవాది, బీఆర్ఎస్ నేత సోమా భరత్ మీడియాకు వెల్లడించడం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ఈడీ అధికారులకు కూడా స్పష్టం చేశారు. ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా, ఈ నెల 20న విచారణకు రావాలంటూ ఈడీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. 

అయితే ఈ పరిణామాలపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 60 కింద కవితను విచారణకు పిలిచారని తెలిపారు. పీఎంఎల్ఏ ప్రత్యేకమైన చట్టం అని స్పష్టం చేశారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు కచ్చితంగా విచారణకు హాజరుకావాలని అభిప్రాయపడ్డారు. 

అదే సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చినట్టయితే ఓ మహిళను ఇంటికెళ్లి విచారిస్తారని లక్ష్మీనారాయణ వివరించారు. సీఆర్పీసీ అనేది జనరల్ యాక్ట్ అని... అందువల్ల పీఎంఎల్ఏ చట్టం సీఆర్పీసీని మించి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈడీ కోర్టులో కవిత ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని లక్ష్మీనారాయణ తెలిపారు.

More Telugu News