Pawan Kalyan: భారతదేశ మెర్కాటర్ మన పొట్టి శ్రీరాములు: పవన్ కల్యాణ్

  • నేడు పొట్టి శ్రీరాములు జయంతి
  • భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటకు బీజం వేశారన్న పవన్ 
  • పొట్టి శ్రీరాములు త్యాగం ఎంతో విలువైనదని నివాళి 
  • ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందిస్తామని ఉద్ఘాటన
Pawan Kalyan remembers Ramachandra Guha words about Potti Sreeramulu

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడానికి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమే కారణం అని కీర్తించారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నానని తెలిపారు. 

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ఒక వ్యాసంలో పొట్టి శ్రీరాములు గురించి రాసిన మాటలు మర్చిపోలేనని వివరించారు. పొట్టి శ్రీరాములు దీక్ష, దాని తదనంతర పరిణామాలు భారతదేశ చిత్రపటాన్ని భాషాప్రయుక్త రేఖల్లో పునఃచిత్రీకరించాయని రామచంద్ర గుహ పేర్కొన్నారని పవన్ వెల్లడించారు. 

అంతేకాదు, పొట్టి శ్రీరాములును భారతదేశ మెర్కాటర్ (1569లో ప్రపంచ పటాన్ని తయారు చేసిన జర్మన్-ఫ్లెమిషన్ భౌగోళిక శాస్త్రవేత్త)గా అభివర్ణించవచ్చు అని కూడా రామచంద్ర గుహ ఆ వ్యాసంలో రాశారని వివరించారు. పొట్టి శ్రీరాములు త్యాగం ఎంత విలువైనదో ఈ మాటలే చెబుతున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ప్రతి సందర్భంలోనూ పొట్టి శ్రీరాములును తమ పార్టీ స్మరించుకుంటుందని తెలిపారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును నిర్ణయించడం అందులో భాగమేనని వెల్లడించారు. ఆ అమరజీవి స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

More Telugu News