Ponnambalam: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. వైద్యఖర్చులకు చిరంజీవి రూ.40 లక్షల సాయం చేశారు: తమిళ నటుడు పొన్నంబలం

  • తన తమ్ముడే తనకు స్లో పాయిజన్‌ ఇచ్చాడన్న పొన్నంబలం 
  • అందువల్లే తన కిడ్నీలు దెబ్బతిన్నాయని వ్యాఖ్య
  • అపోలోలో చిరంజీవి చికిత్స చేయించారని వెల్లడి
tamil actor ponnambalam says his brother gave slow poison to kill him

స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా సౌతిండియాలో గుర్తింపు సాధించిన నటుడు పొన్నంబలం. తన మేనరిజం, హావభావాలతో విలనిజం పండించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది కిడ్నీ సమస్యతో బాధపడిన ఈ తమిళ నటుడు.. తన అనారోగ్యానికి కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పొన్నంబలం మాట్లాడుతూ.. తన సొంత తమ్ముడే తనని చంపడానికి ప్రయత్నించాడని ఆరోపించాడు. ‘‘మద్యం తాగడం వల్లే నా కిడ్నీలు పాడయ్యాయని అందరూ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నా వాళ్లే నన్ను చంపడానికి ప్రయత్నించారు. నా తండ్రికి నలుగురు భార్యలు. మూడో భార్య కుమారుడిని నా సొంత తమ్ముడిగా భావించా. అందుకే అతనికి నా మేనేజర్‌గా ఉద్యోగం ఇచ్చా. నా వృత్తిపరమైన విషయాలన్నీ అతనే చూసుకునేవాడు. అతన్ని నేను చాలా నమ్మాను. కానీ.. అతను నేను తాగే బీర్‌లో స్లో పాయిజన్‌ కలిపాడు’’ అని చెప్పాడు.

‘‘నేను తినే ఆహారంలోనూ స్లో పాయిజన్ కలిపేవాడు. నా ఎదుగుదల చూసి ఓర్వలేక అలా చేశాడు. అంతటితో ఆగకుండా.. నాపై చేతబడి చేయించాడని ఇటీవల నాకు తెలిసింది. అందువల్లే నా కిడ్నీలు దెబ్బతిన్నాయి. వైద్యుల్ని సంప్రదిస్తే విష ప్రయోగం జరగడం వల్లే అలా జరిగిందని తెలిపారు. నేను అతని మంచి కోరి ఉద్యోగం ఇస్తే.. నన్ను చంపాలని చూశాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 

కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స తీసుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సాయం చేశారని, అందువల్లే తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని పొన్నంబలం చెప్పాడు. ‘‘నా ఫ్రెండ్ దగ్గర అన్నయ్య చిరంజీవి నంబర్ తీసుకుని.. సాయం చేయాలని మెసేజ్ చేశాను. చూసిన వెంటనే అన్నయ్య ఫోన్‌ చేశారు. ‘హైదరాబాద్‌ వస్తారా?’ అని అడిగారు. కష్టమని చెప్పాను. దీంతో ‘వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు’ అని చెప్పారు. అక్కడి వెళ్లగా, ఎలాంటి ఫీజు అడగకుండా నన్ను అడ్మిట్ చేసుకున్నారు. చికిత్సకు అయిన మొత్తం ఖర్చు రూ.40 లక్షలను ఆయనే భరించారు. అంతమొత్తం ఆయనే ఇస్తారని అసలు అనుకోలేదు’’ అని వివరించాడు.

More Telugu News