Air india: షికాగో ఎయిర్ పోర్టులో 24 గంటల నిరీక్షణ.. ఏఐ నిర్వాకంతో 300 మంది ప్రయాణికుల ఇక్కట్లు

300 Passengers Left Stranded for Over 24 Hrs due to Air India Flight Cancelled
  • అమెరికాలోని షికాగో ఎయిర్ పోర్టులో ఘటన
  • సుదీర్ఘ ఆలస్యం తర్వాత విమానం రద్దయినట్లు ప్రకటించిన ఏఐ
  • అకామిడేషన్ కల్పించామంటూ ఎయిర్ ఇండియా ప్రకటన
అమెరికాలోని షికాగో నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని చివరి క్షణంలో అధికారులు రద్దు చేశారు. సాంకేతిక కారణాల వల్ల ఏఐ 126 విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో దాదాపు 300 మంది ప్రయాణికులు షికాగో ఎయిర్ పోర్టులో 24 గంటల పాటు అవస్థలు పడ్డారు. తొలుత విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పి, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై మండిపడ్డారు.

హోటల్ లో వసతి కల్పిస్తున్నట్లు కూడా చాలా ఆలస్యంగా చెప్పారని ఆరోపించారు. ఈ నెల 14న ఎయిర్ ఇండియా విమానం ‘ఏఐ 126’ షికాగో నుంచి ఢిల్లీకి రావాల్సి ఉంది. సుమారు 300 మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులో బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో విమానం ఆలస్యంగా నడుస్తుందని అధికారులు ప్రకటించారు. సమయం గడిచే కొద్దీ ఆలస్యాన్ని పెంచుకుంటూ పోయారు.

విమానం ఎప్పుడు బయలుదేరుతుంది, బోర్డింగ్ కు ఎప్పుడు అనుమతిస్తారనే ప్రశ్నలకు ఎయిర్ ఇండియా సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోయారని ప్రయాణికులు విమర్శించారు. దాదాపు 24 గంటల తర్వాత సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు, వారికి హోటల్ లో వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Air india
flight
cancelled
24 hours stranded
chicago
USA

More Telugu News