Mahabubabad District: మూడు వాయిదాల రుణం బాకీ.. రైతు ఇంటి తలుపులు ఊడబెరికిన బ్యాంకు సిబ్బంది!

DCCB Officials Remove Doors Of  A Farmer As A Loan Recovery
  • మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘటన
  • కుటుంబ సభ్యులతో బ్యాంకు సిబ్బంది వాదులాట వీడియో వైరల్
  • తాము దౌర్జన్యం చేయలేదన్న బ్యాంకు సిబ్బంది
  • తలుపులు తిరిగి అప్పగించామని వివరణ
తీసుకున్న రుణంలో మూడు వాయిదాలు బాకీ ఉండడంతో బ్యాంకు సిబ్బంది ఓ రైతు ఇంటి తలుపులు తీసుకెళ్లారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ అనే రైతు తన 2.05 ఎకరాల పట్టాదారు పాసు పుస్తకాన్ని 2021లో గూడూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో తాకట్టు పెట్టి రూ. 4.50 లక్షల రుణం తీసుకున్నారు. 

ఒక్కో వాయిదాకు రూ. 62 వేల చొప్పున ఇంకా నాలుగు వాయిదాలు చెల్లించాల్సి ఉండగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా రూ.60 వేలు మాత్రమే చెల్లించారు. ఇంకా మూడు వాయిదాలు చెల్లించాల్సి ఉండడంతో బ్యాంకు అధికారులు మోహన్‌కు నోటీసులు పంపారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో ఈ నెల 10న పోలీసులతో కలిసి రైతు ఇంటికి చేరుకున్నారు. 

ఆ సమయంలో మోహన్ కుమారుడు, మాజీ సర్పంచ్ అయిన కోడలు స్వరూప ఇంట్లో ఉన్నారు. రుణం బకాయిలు చెల్లించని కారణంగా ఇంటి తలుపులు తీసుకెళ్తున్నట్టు వారికి చెప్పి ద్వారం నుంచి వాటిని తొలగించి వాహనంలో పడేశారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులకు, బ్యాంకు అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. 

బకాయి డబ్బులను త్వరలోనే చెల్లిస్తామని అధికారులను స్వరూప వేడుకోవడంతో ఊడదీసిన తలుపులను తిరిగి అప్పగించి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బ్యాంకు అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన అధికారులు.. రైతు కుటుంబ సభ్యులతో తాము దురుసుగా ప్రవర్తించలేదని, మందలించి తలుపులు తిరిగి అప్పగించామని వివరణ ఇచ్చారు.
Mahabubabad District
Telangana
DCCB
Farmer Loan

More Telugu News