Vijayendra Prasad: ఆర్ఆర్ఆర్ విజయం వెనుక మూడు తరాల కృషి: విజయేంద్ర ప్రసాద్

  • గతంలో ప్రధానితో 40 నిమిషాలు సమావేశమయ్యానన్న విజయేంద్ర ప్రసాద్
  • మోదీ విజన్ కు ఆశ్చర్యపోయానని వ్యాఖ్య
  • మన సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలని ఆయన సూచించారని వెల్లడి
  • దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ కూడా రాజమౌళికి ఇలానే చెప్పారన్న రచయిత
rajamouli father says pm modi and steven spielberg urged same

ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ఆ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంలో తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడం గురించి ప్రస్తావించారు.

గతంలో ప్రధానిని కలిసినప్పుడు 4 నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నానని, కానీ తమ భేటీ 40 నిమిషాలు సాగిందని తెలిపారు. ‘‘ మొత్తం ప్రపంచం భారతదేశం వైపు ఎలా చూడాలి అనే దాని గురించి మేమిద్దరం చర్చించుకున్నాం. మోదీ విజన్ కు నేను ఆశ్చర్యపోయా. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని, దాన్ని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలని ఆయన సూచించారు’’ అని విజయేంద్ర ప్రసాద్ గుర్తుచేసుకున్నారు.

ఇటీవల హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ ను రాజమౌళి కలిశారని, తనకు మోదీ చెప్పినట్లుగా ఆయన కూడా రాజమౌళికి చెప్పారని అన్నారు. భారత దేశ సంస్కృతి ఉట్టిపడేలా సినిమాలు తీయాలని రాజమౌళికి స్పీల్ బర్గ్ సూచించినట్లు చెప్పారు.

ఆర్ఆర్ఆర్ విజయం వెనుక మూడు తరాల క‌ృషి ఉందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ‘‘స్క్రిప్ట్ రాయడానికి నా సోదరుడు శివశక్తి దత్తా సాయం చేశారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. రాజమౌళి భార్య, కీరవాణి, కాలభైరవ.. ఇలా ఎంతో మంది ఉమ్మడి క‌ృషి ఫలితంగా చిత్రం విజయం సాధించింది’’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News