AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

  • సభా హక్కులు ఉల్లంఘించారంటూ తొలుత పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడుపై సస్పెన్షన్ వేటు
  • స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు
  • తర్వాత మరో 10 మందిపై ఒకరోజు వేటు
  • పయ్యావుల, నిమ్మలపై ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్
TDP members Suspended from AP Assembly

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. 12 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలను సభ నుంచి మార్షల్స్ బయటికి తీసుకెళ్లారు.

అంతకుముందు సీఎం కోసం గవర్నర్ నిరీక్షించారని, సీఎం పెద్దా? గవర్నర్ పెద్దా? అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. స్పీకర్ కార్యాలయంలో గవర్నర్ వేచి ఉండేలా చేశారని ఆరోపించారు. దీంతో జగన్ స్వయంగా గవర్నర్ కు స్వాగతం పలికిన వీడియోను ప్రభుత్వం సభలో ప్రదర్శించింది. పయ్యావుల కేశవ్ ఆరోపణలపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను శాసన సభా వ్యవహారాల మంత్రి బుగ్గన కోరారు. 

తర్వాత సభలో తీర్మానాన్ని బుగ్గన ప్రవేశపెట్టారు. సభా సమయం వ‌ృథా చేశారంటూ పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని స్పీకర్ చదివి వినిపించారు. వాయిస్ ఓటుతో తీర్మానాన్ని ఆమోదించారు. వారిద్దరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

దీంతో స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. దేనికి సస్పెండ్ చేశారంటూ స్పీకర్ ను ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తేనే సభ నడుస్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

తర్వాత బుగ్గన మరో తీర్మానం ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు నిమ్మల, పయ్యావులపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, మిగతా సభ్యులను ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశామని స్పీకర్ చెప్పారు.

More Telugu News