dvv danayya: మాట్లాడేందుకు ప్రయత్నించా.. వాళ్లు బిజీగా ఉన్నట్లున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య వ్యాఖ్యలు

  • తెలుగు ఇండస్ట్రీలో పాటకు తొలిసారి ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయమన్న దానయ్య
  • అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుందని వ్యాఖ్య
  • రాజమౌళి తదితరులు ఫంక్షన్ లో బిజీగా ఉన్నట్లున్నారని వెల్లడి 
producer dvv danayya finally reacts rrr movie won oscar

ఆస్కార్ అవార్డు సాధించి.. తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఎక్కడ చూసినా దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి తదితరులు మాత్రమే కనిపించారు. వారి పేర్లే వినిపించాయి. కానీ ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఎక్కడా కనిపించలేదు. ఆయన పేరు ఎక్కడా వినిపించలేదు.

ఈ నేపథ్యంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై దానయ్య స్పందించారు. తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి ఓ పాటకు ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుందని చెప్పారు. 

‘‘2006లో రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దామని అడిగాను. అప్పటి నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నా. మర్యాద రామన్న చేయమని ఆఫర్ ఇచ్చారు. కానీ ఇంకా పెద్ద సినిమా చేయాలనుకుంటున్నానని ఆయనకు చెప్పాను. తన ప్రాజెక్టులు అయిపోయాక చెప్తానని అన్నారు. అలా తర్వాత ఆర్ఆర్ఆర్ నా చేతికి వచ్చింది’’ అని దానయ్య వివరించారు. 

ఇద్దరు స్టార్లతో ఇంత పెద్ద సినిమా తీస్తానని ఊహించలేదని ఆయన చెప్పారు. కరోనా వల్ల ఎన్నో కష్టాలు పడ్డామని, బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువే అయిందన్నారు. ఒక్క నాటు నాటు పాటనే 30 రోజులు రిహార్సల్స్ చేసి.. ఉక్రెయిన్ లో 17 రోజులు షూట్ చేశామని తెలిపారు. ఆ కష్టానికి ప్రతిఫలంగానే ఆస్కార్ వచ్చిందని అభిప్రాయపడ్డారు.

ఆస్కార్ అందుకున్నాక రాజమౌళి, కీరవాణి తదితరులతో మాట్లాడేందుకు ప్రయత్నించానని దానయ్య చెప్పారు. అయితే వాళ్లు ఫంక్షన్ లో బిజీగా ఉన్నట్లున్నారని, తాను మాట్లాడలేకపోయానని చెప్పారు.

More Telugu News