Russia: అమెరికా డ్రోన్ ను ఢీకొట్టిన రష్యా ఫైటర్ జెట్

  • నల్ల సముద్రంలో కూలిన యూఎస్ డ్రోన్
  • డ్రోన్ పై ఇంధనం కుమ్మరించారని వైట్ హౌస్ ఆరోపణ
  • రష్యా తీరును ఖండించిన వైట్ హౌస్ అధికార ప్రతినిధి
  • కూలిన డ్రోన్ తో తమకేం సంబంధంలేదన్న రష్యా
Russian Jet Dumps Fuel On US Drone Then Collides With It Over Black Sea

నల్ల సముద్రంపై ఎగురుతున్న తమ మానవరహిత డ్రోన్ ను రష్యా యుద్ధవిమానం కూల్చేసిందని అమెరికా ప్రకటించింది. రష్యా యుద్ధవిమానం పైలెట్లు డ్రోన్ పై ముందుగా ఇంధనాన్ని కుమ్మరించారని ఆరోపించింది. ఆపై ప్రమాదకరరీతిలో డ్రోన్ ను ఢీ కొట్టి, నేల కూల్చాలని ప్రయత్నం చేశారన్నారు. దీంతో కంట్రోల్ తప్పిన డ్రోన్ నల్ల సముద్రంలో కూలిపోయిందని వెల్లడించింది. రష్యా తీరును ఖండించిన వైట్ హౌస్.. అమెరికాలోని రష్యా రాయబారికి సమన్లు పంపి వివరణ కోరింది.

అంతర్జాతీయ జలాలపై ఎగురుతున్న డ్రోన్ ను అడ్డుకోవడమేంటని అమెరికా మండిపడుతోంది. డ్రోన్ ను కూల్చివేసేందుకు రష్యా పైలెట్లు పర్యావరణానికి ప్రమాదకరంగా ఆకాశంలో ఇంధనాన్ని కుమ్మరించారని విమర్శించింది. తమ డ్రోన్ ను తాకిన రష్యన్ ఫైటర్ జెట్ కూడా దెబ్బతిందని వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. నల్లసముద్రంపై అమెరికా డ్రోన్ కంట్రోల్ తప్పిందని, సముద్రంలో కూలిపోయిందని రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ విషయంలో అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించింది. కాగా, బ్రసెల్స్ లోని నాటో ప్రతినిధులు అమెరికా డ్రోన్ కూలిన ఘటన నిజమేనని ధ్రువీకరించారు. ఈ విషయంలో నెలకొన్న టెన్షన్లు దూరం చేయడానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

More Telugu News