TSPSC: టీఎస్ పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ యువ మోర్చా

  • టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీక్
  • భగ్గుమంటున్న ఉద్యోగార్థులు 
  • టీఎస్ పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు
  • అదనపు బలగాల మోహరింపు
BJP Yuv Morcha protests at TSPSC office

తెలంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నుంచి పలు ఉద్యోగ నియామకాల ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రవీణ్ అనే ఉద్యోగి టీఎస్ పీఎస్సీ కంప్యూటర్ల నుంచి ప్రశ్నా పత్రాలు తస్కరించి, రేణుక అనే మహిళ సాయంతో లీక్ చేసినట్టు గుర్తించారు. మూడు ప్రశ్నా పత్రాలు లీకైనట్టు భావిస్తుండగా, గ్రూప్-1 పేపర్ కూడా లీకైందా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని టీఎస్ పీఎస్సీ కార్యాలయాన్ని బీజేపీ యువ మోర్చా నేడు ముట్టడించింది. యువ మోర్చా కార్యకర్తలు టీఎస్ పీఎస్సీ కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి ప్రవేశించారు. టీఎస్ పీఎస్సీ నేమ్ బోర్డును ధ్వంసం చేశారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ ను సస్పెండ్ చేయాలన్న డిమాండ్ తో వారు నినాదాలు చేశారు. 

టీజేఎస్ విద్యార్థి విభాగం కూడా టీఎస్ పీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించింది. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, టీఎస్ పీఎస్సీ కార్యాలయం వద్ద అదనపు బలగాలను మోహరించారు. 

అటు, టీఎస్ పీఎస్పీ క్వశ్చన్ పేపర్ లీకేజి ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఆందోళనలు నిర్వహించారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు.

More Telugu News