Atchannaidu: చివరి బడ్జెట్ సమావేశాల్లోనైనా స్పీకర్ తీరు మారాలి: అచ్చెన్నాయుడు

  • నాలుగేళ్లుగా శాసనసభ నిర్వహణ చూస్తే బాధేస్తోందన్న అచ్చెన్నాయుడు
  • ప్రతిపక్షాలను గుర్తించడంలేదని ఆవేదన
  • రాష్ట్రంలోని 17 ప్రధాన సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్
tdp leader atchannaidu fires on AP Govt

ప్రస్తుత అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశాల్లోనైనా ప్రభుత్వం, స్పీకర్ తీరు మారాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ నాయకులు వారి ఇష్టం వచ్చినట్టు తయారుచేశారని మండిపడ్డారు. మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. 

గతంలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా శాసనసభను చూశారని, కానీ నాలుగేళ్లుగా శాసనసభ నిర్వహణ చూస్తే బాధేస్తోందని అన్నారు. కనీసం ప్రతిపక్షాలు శాసనసభలో ఉన్నాయని గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరని, మైక్ ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత మీడియాను పెట్టుకుని తమకు నచ్చిన కంటెంట్‌ని బయటకి ఇస్తారని అధికార పార్టీపై ఆయన మండిపడ్డారు. చివరి బడ్జెట్ సమావేశాల్లో అయినా వారిలో మార్పు వచ్చి సజావుగా చర్చ జరగాలని అన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో 17 సమస్యలపై ప్రజలు బాధపడుతున్నారని, వీటిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. 

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే దృఢ సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నారు. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని తెలిపారు. రాజకీయాల్లో పొత్తులనేవి సర్వసాధారణమని తెలిపారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల మీదే పోరాడుతున్నారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులపై పార్టీ అధినేత చంద్రబాబు చర్చించి ప్రకటన చేస్తారని వెల్లడించారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తమ అభ్యర్థిని పోటీలో పెట్టామన్నారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టే బీసీ మహిళను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపామని తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలవడం ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News