Avinash Reddy: ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉంచిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court reserves verdict on MP Avinsah Reddy petition
  • వివేకా హత్య కేసులో అవినాశ్ ను ప్రశ్నిస్తోన్న సీబీఐ
  • తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ అవినాశ్ పిటిషన్
  • సోమవారం వరకు చర్యలు వద్దన్న హైకోర్టు
  • నేడు పిటిషన్ విచారణ కొనసాగింపు
  • సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ పాత్ర ఉందన్న సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా నిలువరించాలని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

అవినాశ్ రెడ్డిపై సోమవారం వరకు చర్యలు తీసుకోవద్దని ఇటీవల ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు, నేడు ఆ పిటిషన్ పై విచారణ కొనసాగించింది. తీర్పును రిజర్వులో ఉంచింది. తీర్పు వెల్లడించే వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి స్పష్టం చేసింది. 

కాగా, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అవినాశ్ రెడ్డి రేపటి సీబీఐ విచారణకు హాజరు కాలేరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందుకు కోర్టు స్పందిస్తూ, విచారణకు రాలేరన్న విషయాన్ని సీబీఐకి తెలియజేసి వారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా సీబీఐ అవినాశ్ కు సంబంధించిన వివరాలను ఓ సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించింది. 35 వాంగ్మూలాలు, 10 కీలక పత్రాలు, పలు ఫొటోలను సమర్పించింది. అవినాశ్ రెడ్డి విచారణను ఆడియో-వీడియో రికార్డింగ్ చేస్తున్నామని కోర్టుకు తెలిపింది. 

కాగా, ఈ కేసులో సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ స్పష్టం చేసింది. అందువల్ల, అవినాశ్ పై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. 

ప్రశ్నించే సమయంలో అవినాశ్ కనిపించేలా ఆయన న్యాయవాదికి అనుమతి ఇవ్వగలరా? అని సీబీఐని హైకోర్టు ధర్మాసనం అడిగింది. అవినాశ్ కనిపించేలా ఆయన న్యాయవాదిని విచారణకు అనుమతించే విషయం పరిశీలిస్తామని సీబీఐ తెలిపింది.

అటు, సీబీఐ ఆఫీసు వద్ద అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు జరుగుతుండగా సీబీఐ కార్యాలయం వద్దే ప్రెస్ మీట్ ఏంటని మండిపడింది. 

వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారణకు పిలిపించారన్న అంశం కూడా హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. వివేకా హత్య కేసు విచారణ హైదరాబాదుకు బదిలీ అయితే కడపకు ఎందుకు పిలిచారని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. భాస్కర్ రెడ్డిని కడపలో విచారణకు తాము పిలవలేదని సీబీఐ బదులిచ్చింది.
Avinash Reddy
YS Vivekananda Reddy
CBI
Telangana High Court

More Telugu News