Ram Charan: లాస్ ఏంజెల్స్ లో అభిమానులతో రామ్ చరణ్ ఆత్మీయ సమావేశం

  • మరికొన్ని గంటల్లో ఆస్కార్ ప్రదానోత్సవం
  • అమెరికాలో ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్
  • అభిమానులను కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పిన రామ్ చరణ్
  • అభిమానులే తనకు ప్రపంచం అని వెల్లడి
Ram Charan meet his fans in Los Angeles

యావత్ ప్రపంచం ఆస్కార్ ఫీవర్ తో ఊగిపోతోంది. మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. మునుపెన్నడూ లేనివిధంగా భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ఈసారి ఆస్కార్ సంరంభం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అందుకు కారణం... ఆస్కార్ బరిలో మన ఆర్ఆర్ఆర్ చిత్రం ఉండడమే. నాటు నాటు పాటకు గాను ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీకి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, ఆర్ఆర్ఆర్ బృందం ప్రస్తుతం అమెరికాలోనే ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వివిధ అవార్డులు అందుకుంటూ, పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్సాహంగా ఉన్నాడు. తాజాగా, రామ్ చరణ్ లాస్ ఏంజెల్స్ నగరంలో అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించాడు. తన అమెరికా పర్యటనను మరపురానివిధంగా మార్చారంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. 

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ... అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించాడు. మరిన్ని మంచి చిత్రాలు చేసేందుకు అభిమానుల ప్రేమ, మద్దతు తనకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నాడు. 

"మీరు నా కోసం ఎంతో దూరం నుంచి వచ్చారు. రోడ్డు మార్గంలోనూ, విమానాల్లో కూడా వచ్చారు. అభిమానులతో ముచ్చటించడం ఎప్పుడూ ఆనందదాయకమే. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ కు థాంక్స్ చెబుతున్నాను. మీ స్వచ్ఛమైన ప్రేమాభిమానాల కారణంగానే ఇవాళ మేం ఇక్కడున్నాం" అని భావోద్వేగభరితంగా స్పందించాడు. ఇక ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ, ఆస్కార్ లో తాము చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పాడు. ఓ భారతీయుడిగా, తెలుగు వ్యక్తిగా ఈ మాట చెబుతున్నానని అన్నాడు. మేం అందుకుంటున్న ఈ ఘనత మరికొన్నేళ్ల పాటు చరిత్రలో నిలిచిపోతుందని రామ్ చరణ్ పేర్కొన్నాడు. 

ఇక, అమెరికాలో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని ఆదరించిన తీరు పట్ల కూడా స్పందించాడు. మెగాస్టార్ చిరంజీవి గత జనవరిలో జూమ్ కాల్ లో అభిమానులతో మాట్లాడిన వైనాన్ని కూడా గ్లోబల్ స్టార్ ప్రస్తావించాడు. 

అంతేకాదు, నిధులు సేకరించి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండడం పట్ల రామ్ చరణ్ తన ఫ్యాన్స్ ను అభినందించాడు. అభిమానులే తనకు ప్రపంచం అని స్పష్టం చేశాడు. 

ఈ సమావేశంలో అభిమానులు కూర్చున్న ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేసి ఫొటోలు దిగాడు. ఈ సందర్భంగా యూఎస్ఏ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ తమ ఆరాధ్య హీరో రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపింది.

More Telugu News