YS Bhaskar Reddy: అరెస్ట్ చేస్తే చేసుకోండి.. అన్నింటికీ సిద్ధమే: వైఎస్ భాస్కర్ రెడ్డి

  • వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్న భాస్కర్ రెడ్డి
  • హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్న
  • అవినాశ్ రెడ్డి అన్ని విషయాలు చెప్పారని.. తాను చెప్పేదేం లేదని వ్యాఖ్య
ys bhaskar reddy says will support for investigation and prepared to face any thing in viveka case

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తమను అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి. మేం అన్నింటికీ సిద్దమే’’ అని ఆయన స్పష్టం చేశారు.

వివేకా హత్య కేసులో ఇప్పటికే ఒకసారి భాస్కర్ రెడ్డిని, మూడు సార్లు ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఈ నెల 12న మరోసారి విచారణకు రావాలంటూ భాస్కర్ రెడ్డికి నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహం వద్దకు ఆదివారం వచ్చారు. అయితే అక్కడ సీబీఐ అధికారులు లేకపోవడంతో భాస్కర్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. విచారణ తేదీని మళ్లీ చెబుతామని అధికారులు తెలియజేసినట్లు చెప్పారు. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అవినాశ్ రెడ్డి అన్ని విషయాలు చెప్పారని.. తాను చెప్పేది ఏమీలేదని వివరించారు.

తనకు ఆరోగ్యం బాగా లేకపోయినా.. విచారణకు సహకరించాలనే ఉద్దేశంతో వచ్చానని భాస్కర్ రెడ్డి చెప్పారు. విచారణ అధికారులు అందుబాటులో లేరని.. మరోసారి నోటీసులు ఇస్తామని చెప్పారన్నారు. నోటీసులు ఇస్తే విచారణకు వస్తానని తెలిపారు. కేసు పరిష్కారం కావాలంటే కీలకమైన లేఖ బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ హైకోర్టులో జరుగుతున్న సమయంలో తాను ఇంత కంటే ఏమీ చెప్పలేనని వ్యాఖ్యానించారు.

More Telugu News