Telangana: టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ హ్యాక్‌.. రెండు పరీక్షలు వాయిదా

  • ఈ రోజు జరగాల్సిన టీపీబీవో పరీక్ష వాయిదా వేసిన కమిషన్
  • ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష కూడా
  • పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు అనుమానిస్తున్న అధికారులు
TSPSC website hacked

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) వెబ్ సైట్ హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించారు. దాంతో, రెండు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష, ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్ లైన్ లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష జరగాల్సి ఉంది. వీటిని వాయిదా వేస్తున్నట్టు కమిషన్ తెలిపింది. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ అయినట్టుగా అనుమానాలున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.

హ్యాకింగ్ లో రెండు పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్‌ అయినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హ్యాకింగ్‌ ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. కానీ, టీపీబీవో పరీక్షకు ఒకరోజు ముందు హ్యాక్ విషయాన్ని వెల్లడించి, పరీక్ష వాయిదా వేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. ఇక, హ్యాకింగ్‌ అంశాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ, కమిషన్ స్థానిక బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

More Telugu News