Revanth Reddy: ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ.. లిక్కర్ స్కామ్ పరిణామాలపై రేవంత్ రెడ్డి

  • బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయన్న రేవంత్
  • రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆరోపణ
  • ఈడీ తలుచుకుంటే ఎమ్మెల్సీ కవితను గంటలోపే అరెస్ట్ చేయొచ్చని వ్యాఖ్య
tpcc chief revanth reddy fires on brs bjp over delhi liquor scam

ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరవడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ మూడో సారి అధికారంలోకి వచ్చేలా.. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించేలా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా రెండు పార్టీలు పథకాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. 

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఈ రోజు మీడియాతో రేవంత్ మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తలుచుకుంటే ఎమ్మెల్సీ కవితను గంటలోపే అరెస్ట్ చేయొచ్చని చెప్పారు. కవితను జైల్లో వేయడానికి ఇంత సేపా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఇవి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని రేవంత్ విమర్శించారు. కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తారని.. బీజేపీ కూడా రోడ్డెక్కుతుందన్నారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని విమర్శించారు.

అదానీ అంశం పార్లమెంటులో చర్చకు వస్తుందనే.. బీజేపీ వ్యూహాత్మకంగా లిక్కర్ స్కామ్ ను బయటికి తీసిందని రేవంత్ ఆరోపించారు. అదానీ అంశం వల్ల దేశవ్యాప్తంగా బీజేపీకి నష్టం జరుగుతుందనే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చూస్తున్నారన్నారు. ‘‘చిన్నపిల్లాడిని కుక్కలు చంపేస్తే పట్టించుకోలేదు. మహిళలపై దాడులు జరిగితే స్పందించరు. కానీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణకు హాజరైతే మాత్రం నలుగురు ఢిల్లీకి వెళ్లారు’’ అని రేవంత్ విమర్శించారు.

More Telugu News