Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

  • మార్చి 13న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
  • వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన చంద్రబాబు
  • టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వరాదని పిలుపు 
  • పీడీఎఫ్ తో అవగాహన కుదుర్చుకున్నట్టు వెల్లడి
TDP Chief Chandrababu open letter to people

ఈ నెల 13న ఏపీలో ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు. 

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రలోభాలతో వైసీపీ అక్రమ విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు చిరంజీవిరావు (ఉత్తరాంధ్ర), కంచర్ల శ్రీకాంత్ (తూర్పు రాయలసీమ), భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (పశ్చిమ రాయలసీమ)లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ తో అవగాహనకు వచ్చామని తెలిపారు. రెండో ప్రాధాన్యత ఓటును పీడీఎఫ్ కు వేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

2014లో అధికారంలోకి వచ్చాక అనేక సవాళ్లను అధిగమించాం అని చంద్రబాబు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని వివరించారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం సరిగా ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.

More Telugu News