Satya Nadella: చిన్నప్పుడు చదువంటే బోర్ కొట్టేది: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

  • లింక్డ్ఇన్ సీఈఓతో సత్య నాదెళ్ల ఇంటర్వ్యూ
  • చిన్నతనంలోని విశేషాలు పంచుకున్న నాదెళ్ల
  • తన సక్సెస్‌కు తల్లిదండ్రులే కారణమని వెల్లడి 
Satya Nadella says studies were boring instead he liked cricket when he was in India

చిన్నప్పుడు తనకు చదువంటే బోర్ కొట్టేదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. క్రికెట్ వైపే మనసు లాగేదని చెప్పుకొచ్చారు. లింక్డ్ఇన్ సీఈఓ రయాన్ రోలన్సీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల తన బాల్యానికి సంబంధించిన పలు విశేషాలను వెల్లడించారు. చదువుల్లో తాను అంతగొప్పగా రాణించేవాణ్ణి కాదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే..కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌‌తో అనేక పనులు సులువుగా చేయగలిగే అవకాశం ఉండటం తనను ఆ రంగంవైపు ఆకర్షించిందని తెలిపారు. చిన్నతనంలో తన దృష్టి చదువుపైకంటే..క్రికెట్‌పైనే ఎక్కువగా ఉండేదని పేర్కొన్నారు. 

ఇక వృత్తిజీవితంలో తన విజయాలకు తల్లిదండ్రులే కారణమని సత్య నాదెళ్ల వెల్లడించారు. తన అభిరుచికి తగిన అవకాశాలను వెతుక్కునే ఆత్మవిశ్వాసాన్ని, స్వేచ్ఛను వారు తనకు ఇచ్చారన్నారు. ‘‘నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి నా తల్లిదండ్రులే ప్రధాన కారణం. మా నాన్న ప్రభుత్వాధికారి. అమ్మేమో సంస్కృతం ప్రొఫెసర్. ఒకరకంగా చూస్తే వారిద్దరు భిన్న ధ్రువాలు. అయితే.. నా విషయంలో మాత్రం వారి మధ్య భిన్నాభిప్రాయాలే ఉండేవి కావు. నన్ను నా అభిరుచికి తగ్గట్టు ముందుకెళ్లేలా ప్రోత్సహించారు. స్వేచ్ఛనిచ్చారు’’ అని సత్య నాదెళ్ల తెలిపారు. 

కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల విజన్ ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. 2019 నుంచీ ఈ చాట్‌బాట్ అభివృధ్దికి మైక్రోసాఫ్ట్ తోడ్పాటునందిస్తోంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ సాయంతో మైక్రోసాఫ్ట్.. సెర్చ్ ఇంజన్ రంగంలో గూగుల్‌కు సరికొత్త సవాలు విసిరింది.

More Telugu News